
సరైన రీతిలో బోధించాలి
పార్వతీపురం రూరల్: జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సరైన రీతిలో ఉపాధ్యాయులు బోధన చేసి నాణ్యమైన విద్యను అందించడం ద్వారా వారిలో జ్ఞానాన్ని, నైపుణ్యాలను పెంచవచ్చునని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. అందుకు తగిన ప్రణాళికలు జిల్లా విద్యాశాఖ చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయన అధ్యక్షతన పాఠశాల విద్య, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా బోధనలో మార్పులు రావాలని, ఈ మేరకు ఉపాధ్యాయులకు శిక్షణ అవసరమన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన విద్యార్థులకు బోధించేందుకు లాంగ్వేజ్ పండిట్‌లను నియమించాలని, అలాగే విద్యార్థులకు అందించే విద్యాబోధనతో పాటు వారి ఆరోగ్యంపై కూడా దృష్టిసారించడం ముఖ్యమని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో డీఈఓ రాజ్‌కుమార్, ఏపీసీ తేజేశ్వరావు, ఎస్‌జీటీ వనజాక్షి, మరికొంతమంది ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
పలు కార్యక్రమాలపై సమీక్ష
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పలు కార్యక్రమాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ గురువారం తన కార్యాలయంలోని సమావేశ మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎరువుల పర్యవేక్షణ పటిష్టంగా ఉండాలని పీ4, డాక్యుమెంటేషన్ అప్‌లోడ్, మౌలిక సదుపాయాల కల్పన, ఎరువుల పంపిణీ ప్రక్రియ వంటి కార్యక్రమాపై సమీక్షించాలని, అలాగే ఎరువుల విషయంలో అవసరాలను ముందుగా గుర్తించి చర్యలకు సిద్ధం కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలియజేసినట్లు కలెక్టర్ తెలిపారు. అన్నదాత సుఖీభవ–పీఎంకిసాన్ యాక్టివ్, ఇన్‌యాక్టివ్ ఖాతాలను పరిశీలించాలని తెలియజేసినట్లు తెలిపారు. పీ4లో మార్గదర్శి, బంగారు కుటుంబాలు అనుసంధానం సర్వే తదితర అంశాలను పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్‌ఎస్ శోభిక, డీఆర్‌ఓ కె. హేమలత, డిప్యూటీ కలెక్టర్ దిలీప్ చక్రవర్తి, డ్వామా పీడీ కె. రామచంద్రరావు, డీఆర్‌డీఏ పీడీ ఎం.సుధారాణి, డీఎంహెచ్‌ఓ ఎస్.భాస్కరరావు, ఆర్‌బీఎస్‌కే జిల్లా అధికారి జగన్‌మోహన్‌రావు, జిల్లా సర్వే అధికారి లక్ష్మణరావు, ప్రకృతి వ్యవసాయం డీఎం శ్యామ్ కుమార్, డీపీఓ కొండలరావు, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్