
భక్తులను ఆకర్షించేలా తోటపల్లి ఆలయ నిర్మాణం
గరుగుబిల్లి: తోటపల్లిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం భక్తులకు ఆధ్యాత్మిక చింతన మరింత చేరువ చేసి ఆకర్షించేలా ఆలయాల నిర్మాణాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన దేవస్థానంలో నూతనంగా నిర్మించిన వాన ప్రస్త్రాశమం, అన్నప్రసాద సత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తోటపల్లిలో వెలసిన శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రభావం ఈ ప్రాంతంపై ఎంతో ఉందన్నారు.భక్తుల ఇలవేల్పుగా, ఈ ప్రాంతానికి చిన తిరుపతిగా తోటపలి దేవస్థానాన్ని కొనియాడుతున్నారన్నారు. ఆలయ నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకోవడంతో ఈ ప్రాంతంలోని ఆధ్యాత్మిక భావాలు కలిగిన వారంతా ఒక్కటై ఆలయ అభివృద్ధికి ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి ఆలయ పునర్నిర్మాణానికి కంకణం కట్టుకున్నారని చెప్పారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు నిర్మాణాలు జరగడంతో ఆలయానికి కొత్త శోభ వచ్చిందన్నారు. ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణానికి, అభివృద్ధి పనులకు సహకరించిన పలువురు దాతలను కలెక్టర్ అభినందించారు. అనంతరం కలెక్టర్‌ను దుశ్శాలువతో సన్మానించి, వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని ట్రస్ట్ సభ్యులు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ వీవీ సూర్యనారాయణ, సర్పంచ్ ఆవాల సింహాచలమమ్మ, ఎంపీటీసీ ఎం.సింహాచలం నాయుడు, ట్రస్ట్ సభ్యులు డి. పారినాయుడు, డి.ధనుంజయరావుతో పాటు పలువురు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్

భక్తులను ఆకర్షించేలా తోటపల్లి ఆలయ నిర్మాణం