
దారిద్య్రం
సీతంపేట:
మన్యం ప్రజలను ‘దారి’ద్య్రం వెంటాడుతోంది. సరైన ‘మార్గం’ చూపేవారు లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తు లు తరలించేందుకు అగచాట్లు ఎదుర్కొంటున్నారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 1250కు పైగా గిరిజన గ్రామాలున్నాయి. వీటిలో పూర్తిగా రహదారులు లేని గ్రామాలు 120కి పైగా ఉన్నాయి. అలాగే ఛిద్రమైన దారులు 100కు పైగా ఉంటాయ ని అంచనా. అటవీశాఖ అభ్యంతరాలతో కొన్ని గ్రామాలకు రో డ్లు వేయలేని పరిస్థితి. ఏజెన్సీలో ఉన్న రోడ్లు అధ్వా నంగా మారడం, కొత్తరోడ్లు వేసేందుకు కూటమి ప్రభుత్వం చొరవచూపకపోవడంతో రాకపోకలకు గిరిజనులు అవస్థలు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో 108 వాహన సేవలు అందక డోలీలోనే రోగులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు. కనీసం గత ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్లనైనా పూర్తిచేయాలని ప్రాథేయపడుతున్నా పట్టించుకోకపోవ డంపై గిరిజన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాడైన రోడ్లపై ప్రయాణ కష్టాలు..
●కోపువలస నుంచి సందిగూడ వయా వంబరెల్లికు కొత్త రోడ్డు నిర్మాణానికి ఉపాధిహామీ పథకం నిధులు రూ.3 కోట్లు మంజూరైనా పనులు మాత్రం జరగలేదు. ఆ ప్రాంత ప్రజలకు రోడ్డు కష్టాలు తప్పడంలేదు.
●కోదులవీరఘట్టం, దాసుపరం, అంబలగండి గ్రామాలకు వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. గుడ్డిమీద గూడ మీదుగా కడగండి వెళ్లే రహదారిపై కొండచరియలు విరిగిపడడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
●కొఠారింగు–తాళ్లబద్రకు రహదారిలేకపోవడంతో రెండు రోజుల కిందట ఓ గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు గిరిజనులు అష్టకష్టాలు ఎదుర్కొన్నా రు. గర్భిణులను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు వచ్చి న అంబులెన్స్ బురదలో కూరుకుపోయింది. స్థానికు ల సాయంతో అతికష్టం మీద అంబులెన్స్‌ను తీశారు.
●తుంబలి, చావిడివలస తదితర గ్రామాలకు వెళ్లే రోడ్డు పూర్తిగా పాడయ్యాయి. ముకుందాపురం రోడ్డు పనులు ప్రారంభించి వదిలేశారు. ఎగువద్వారబంధం గ్రామానికి వేసిన రోడ్డు నాణ్యతలేక వర్షాలకు కొట్టుకుపోయిందని గిరిజనులు వాపోతున్నారు. పొంజాడ–ఆడలి రహదారిదీ ఇదే పరిస్థితి. శిలిగా నుంచి ఈతమానుగూడ రోడ్డుపై రాళ్లుతేలాయి. దబర నుంచి దబరగూడకు రోడ్డు నిర్మాణమే జరగలేదు.
రోడ్ల పనుల్లో అలసత్వం తగదు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన రోడ్ల పనులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా పూర్తిచేయలేదు. సీతంపేట ఏజెన్సీలో 10 రోడ్ల నిర్మాణానికి ఏడాదిన్నర కిందట రూ.13.5 కోట్ల నిధులు మంజూరయ్యాయి. అంతకముందు మరో 20 రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరైనా వాటి పనులు ఇప్పటికీ పూర్తిచేయలేదు. కొత్త రోడ్లు మంజూరు ఎలాగూలేదు. కనీసం అసంపూర్తిగా ఉన్న రోడ్లను పూర్తిచేస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయి. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– విశ్వాసరాయి కళావతి, పాలకొండ మాజీ ఎమ్మెల్యే

దారిద్య్రం