
ఎన్నడైనా చూశామా?
● కలెక్టర్ల పనితీరుపై సర్వే
● కొద్దిరోజులుగా మోత మోగుతున్న
ఐవీఆర్‌ఎస్ కాల్స్
● అధికారులు, రాజకీయ నాయకులు
ఒకటేనా? అని ప్రశ్నిస్తున్న ఉద్యోగ సంఘాలు
సాక్షి, పార్వతీపురం మన్యం:
గత ఎన్నికలకు ముందు.. ‘మీరు ఏ పార్టీ అభ్యర్థికి ఓటేస్తున్నారు’ అంటూ ఓ సర్వే... వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన.. అనే ఆప్షన్లు!
కూటమి అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు.. అంటూ ఇంకో సర్వే.. ఓ మూడు, నాలుగు పేర్లు!
ఎన్నికల్లో గెలిచిన తర్వాత, నామినేటెడ్ పదవుల భర్తీ నిమిత్తం.. ‘మీ ప్రాంతంలో పార్టీ కోసం బాగా కష్టపడుతున్న వ్యక్తి ఎవరు?’ అని మరో సర్వే!!
అభ్యర్థుల గెలుపోటములు, ఎంపికలు, విజయావకాశాలు... సాంకేతికత అభివృద్ధి చెందిన తర్వాత ఇలా వివిధ సర్వేలను రాజకీయ పార్టీలు నిర్వహించడం సాధారణం అయిపోయింది. ఇందుకు భిన్నంగా.. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం మరో సర్వే చేపడుతోంది. ‘మీ కలెక్టర్ పని తీరు ఎలా ఉందంటూ’.. ఇటీవల జిల్లా వ్యాప్తంగా ఐవీఆర్‌ఎస్ కాల్స్ మోత మోగుతున్నాయి. మీ కలెక్టర్ పని తీరు పట్ల సంతృప్తిగా ఉన్నారా? అంటూ రికార్డెడ్ కాల్ వాయిస్ వస్తోంది. కొద్దిరోజులుగా కలెక్టర్ల బదిలీలు ఉంటాయన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇటువంటి సర్వే నిర్వహిస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
కలెక్టర్లు.. రాజకీయ నాయకులు ఒక్కటేనా?
జిల్లా కలెక్టర్‌గా శ్యామ్ ప్రసాద్ ఇక్కడ బాధ్యతలు స్వీకరించి ఏడాది అయ్యింది. ఇదే సమయంలో ఆయన బదిలీపై త్వరలో వెళ్లిపోనున్నారన్న ప్రచారం ఉంది. సాధారణంగా ఏ జిల్లాలో అయినా కలెక్టర్లు రెండేళ్లు మించి పని చేయరు. ప్రభుత్వాలు మారినప్పుడు తమకు అనుకూలమైన ఐఏఎస్‌లను తెచ్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అంతేగానీ.. రాజకీయ నాయకుల మాదిరిగా సర్వేల ద్వారా కలెక్టర్ల పనితీరును తెలుసుకోవడం మునుపెన్నడూ లేదు. దేశంలోనే అత్యున్నత సర్వీసు అయిన కలెక్టర్ పోస్టు అంటే అందరికీ గౌరవమే. జిల్లా మేజిస్ట్రేట్‌గా, ఆ జిల్లాకు ఉన్నత అధికారిగా అన్ని అధికారాలూ ఉంటాయి. అటువంటి వారిని తప్పు పట్టేలా, చిన్నబుచ్చుకునేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటువంటి విధానాన్ని ఎప్పుడూ చూడలేదని ఉద్యోగవర్గాలు అంటున్నాయి. ఏ చదువూ అర్హత లేని రాజకీయ నాయకుడు.. ఉన్నత చదువులు చదివిన కలెక్టర్ ఒక్కటేనా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం తీరుపై ఉద్యోగ వర్గాలు గుర్రుగా ఉన్నాయి. తమకు ఇస్తామన్న బకాయిలు ఏవీ చెల్లించడం లేదు సరికదా.. వివిధ సర్వేలు, ఇతర పనులు అంటూ పని భారం మోపుతున్నాయన్న ఆవేదనలో ఉన్నారు. దీనికి తోడు బంగారు కుటుంబాలు అని కొన్ని పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. ఇలా ఉద్యోగ వ్యతిరేక విధానాలను ఆయా సంఘాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం మొండిగానే ముందుకు వెళ్తోంది.
కలెక్టర్ల పనితీరుపై సర్వేకు ఈ ఫోన్
నంబర్‌తోనే వస్తున్న కాల్స్

ఎన్నడైనా చూశామా?

ఎన్నడైనా చూశామా?

ఎన్నడైనా చూశామా?