
చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలి
పార్వతీపురం రూరల్: జిల్లాలో నూతనంగా ఎన్నికైన రెడ్‌క్రాస్ కార్యవర్గ సభ్యులు చిత్తశుద్ధితో తమ సేవలను ప్రజలకు అందించాలని రెడ్‌క్రాస్ అధ్యక్షుడు, కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ సూచించారు. కలెక్టరేట్ ిపీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో జిల్లా రెడ్‌క్రాస్ నూతన అధ్యక్ష, కార్యదర్శి ఎన్నికలను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్ట ర్ మాట్లాడుతూ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో రెడ్‌క్రాస్ సేవలు విస్తరింపజేయాలన్నారు. ప్రతి మండలంలోనూ సభ్యత్వ నమోదుచేసి గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాలో మలేరియా, ఎనీమియా, సికిల్‌సెల్ బాధితుల వివరాలు నమోదు చేయాలని, వారికి అవసరమైన మందులు, బలవర్ధకమైన ఆహారం రెడ్‌క్రాస్ నుంచి అందేలా చూడాలన్నారు. గర్భిణులకు పౌష్టికాహారం, చదువుకునే పిల్లలకు రెడ్‌క్రాస్ సంస్థ తరఫున సాయం అందించాలని సూచించారు. జిల్లాలో రక్తం నిల్వలు పెంచేందుకు కృషిచేయాలని కోరారు. రెడ్‌క్రాస్ సంస్థకు నగరంలో ప్రభుత్వ భవనం ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రతి మండలంలో రెడ్‌క్రాస్ కమిటీ ఉండాలని, నెల లేదా మూడు నెలలకోసారి సమావేశాలు నిర్వహించాలన్నారు.
కార్యవర్గం ఇదే..
రెడ్‌క్రాస్ చైర్మన్‌గా డాక్టర్ మంచిపల్లి శ్రీరాములు, కార్యదర్శిగా బి.నాగభూషణరావు, కోశాధికారిగా పెంటపాటి సూర్యారావును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ సేవకులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ కోఆర్డినేటర్ జనార్దనరావు, మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్
రెడ్ క్రాస్ నూతన కార్యవర్గం ఎన్నిక