
ఇన్‌స్పైర్ మనక్‌లో భాగస్వామ్యం కావాలి
పార్వతీపురం టౌన్: ఇన్‌స్పైర్ మనక్‌లో జిల్లాలోని అన్ని పాఠశాలలు భాగస్వామ్యం కావాలని జిల్లా విద్యాశాఖధికారి బి.రాజకుమార్ తెలియజేశారు. ఇన్‌స్పైర్ మనక్ 2025–26కు గాను డివిజనల్ లెవెల్ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం స్థానిక డీవీఎంఎం ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఇన్‌స్పైర్ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మక ఆలోచనలు వెలికితీయవచ్చని, నిజజీవిత సమస్యలకు పరిష్కారం కనుగొనేలా ప్రాజెక్టులు రూపొందించాలన్నారు. జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో ప్రాజెక్టులు నామినేషన్ అయ్యేలా అందరు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. జాతీయస్థాయికి వెళ్లేలా ప్రాజెక్టులు సిద్ధం చేయించాలన్నారు. ఇన్‌స్పైర్ ప్రాజెక్ట్‌ల నామినేషన్లకు సెప్టెంబర్ 15 చివరి తేదీ అని అంతకు ముందుగానే ప్రాజెక్ట్ సబ్‌మిట్ చేయాలని సాంకేతిక సమస్యలు ఉంటే తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏపీసీ ఆర్.తేజేశ్వరరావు, జిల్లా సైన్స్ అధికారి జి.లక్ష్మణరావు, డివిజన్‌లో అన్ని మేనేజ్మెంట్ పాఠశాల నుంచి ఉపాధ్యాయులు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు పెంట రామకృష్ణ, స్థానిక పాఠశాల హెచ్‌ఎం భాస్కర్, ఏఎస్‌ఓ శంకరరావు తదితరులు పాల్గొన్నారు.