
పీఏసీఎస్‌లకు పర్సన్ ఇన్‌చార్జ్‌లు
● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
● జిల్లాలో మొత్తం పీఏసీఎస్‌లు 42
● 18 సొసైటీలకు గతంలో త్రీమెన్ కమిటీ నియామకం
● మిగిలిన 24 సొసైటీల్లో కొలిక్కిరాని కమిటీలు
● 24 సొసైటీలకు పర్సన్ ఇన్‌చార్జ్‌ల నియామకం
వీరఘట్టం: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పీఏసీఎస్‌లలో నామినేటెడ్ పదవులు వస్తాయని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు చోట్ల సొసైటీల్లో త్రీమెన్ కమిటీ నియామకాలకు కూటమిలో ఏర్పడిన కుమ్ములాటలతో పీఏసీఎస్‌లో చైర్మన్ కుర్చీలు ఖాళీగా మిగిలాయి. ముఖ్యంగా జిల్లాలోని పాలకొండ, పార్వతీపురం డివిజన్లలో ఈ నియామకాలు ఆగిపోయాయి. మిగిలిన చోట్ల నెల రోజుల క్రితమే త్రీమెన్ కమిటీలను ఎమ్మెల్యేల సిఫార్సులతో నియమించారు. చైర్మన్ కుర్చీలు ఖాళీగా ఉన్న చోట ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు ఈనెల 1న ప్రభుత్వం పర్సన్ ఇన్‌చార్జ్‌లను ఈ సొసైటీలకు నియమించింది. ఆరు నెలల పాటు 2026 జనవరి 30 వరకు పర్సన్ ఇన్‌చార్జ్‌లు ఇక్కడ ప్రత్యేకాధికారులుగా వ్యవహరించేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో చాలా రోజులుగా పీఏసీఎస్‌లలో చైర్మన్ పదవి వస్తుందని ఆశించిన వారికి నిరాశే మిగిలిందని పలువురు చర్చించుకుంటున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 42 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘా(పీఏసీఎస్)లు ఉన్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పీఏసీఎస్‌లలో నియమించిన త్రీమెన్ కమిటీలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 జూన్ 28న స్వచ్ఛందంగా తప్పుకున్నారు.దీంతో గత 14 నెలలుగా పీఏసీఎస్‌లలో త్రీమెన్ కమిటీలు లేక పాలన గాడి తప్పుతోంది. ఈ క్రమంలో గతేడాది అన్ని సొసైటీలకు ఆరు నెలల పాటు ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. తొలుత పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించాలని ఆలోచన చేసిన ప్రభుత్వం తర్వాత నామినేటెడ్ పద్ధతిలో త్రీమెన్ కమిటీలను నియమించాలని ఆలోచన చేసింది. దీంతో జిల్లాలోని ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార్సులతో 18 పీఏసీఎస్‌లకు నెలరోజుల క్రితం త్రీమెన్ కమిటీలు నియమించారు. చైర్మన్ పదవి కోసం అటు టీడీపీ, ఇటు జనసేన నేతల మధ్య పోటీ ఏర్పడడంతో జిల్లాలో 24 పీఏసీఎస్‌లలో త్రీమెన్ కమిటీ నియామకాల కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు కుస్తీ పడుతున్నారు. ఇంతలో ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ప్రత్యేకాధికారులను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో ఆశావహులు కంగుతిన్నారు.
24 పీఏసీఎస్‌లకు ప్రత్యేధికారులు..
పాలకొండ నియోజకవర్గంలో 8 పీఏసీఎస్‌లు ఉండగా ఇక్కడ ఏ ఒక్క సొసైటీలో కూడా త్రీమెన్ కమిటీలను నియమించలేకపోయారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణకు, టీడీపీ ఇన్‌చార్జ్ భూదేవిల మద్య సయోద్య కుదరకపోవడంతో సొసైటీల్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయలేకపోయారని అందరూ చర్చించుకుంటున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలోని భామిని, బత్తిలి, అర్ధలి, బాసూరు, పాలకొండ, ఆర్‌బీఆర్.పేట, తంపటాపల్లి, వీరఘట్టంలో త్రీమెన్ కమిటీలు వేయలేదు. అలాగే పార్వతీపురం డివిజన్‌లోని గరుగుబిల్లి, చినమేరంగి, కృష్ణపల్లి, పలగర, గలావిల్లి, అజ్జాడ, బూర్జ, సీతానగరం, కాశీపేట, గెడ్డలుప్పి, పార్వతీపురం, తామరఖండి, అంటిపేట, ఆర్.వెంకమ్మపేట, మరిపివలస, పాపమ్మవలస సొసైటీలకు కూటమి నాయకులు త్రీమెన్ కమిటీలను వేయకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది.
ప్రత్యేకాధికారులను నియమించారు
జిల్లాలో త్రీమెన్ కమిటీలు లేని 24 సొసైటీలకు ప్రభుత్వం పర్సన్ ఇన్‌చార్జ్‌లను నియమించింది.వచ్చే ఏడాది జనవరి 30 వరకు ఇన్‌చార్జ్‌లు ఉంటారు.ఒక వేళ ఇంతలో త్రీమెన్ కమిటీలు వస్తే పర్సన్ ఇన్‌చార్జ్‌లు మరి ఉండరు.
పి.శ్రీరామమూర్తి, జిల్లా కోపరేటివ్ అధికారి

పీఏసీఎస్‌లకు పర్సన్ ఇన్‌చార్జ్‌లు