
హెచ్‌సీ కుటుంబానికి ఆర్థిక సహాయం
డెంకాడ: రోడ్డు ప్రమాదంలో మరణించిన చింతలవలస ఐదవ ఏపీఎస్‌పీ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ కోరాడ రామునాయుడు కుటుంబానికి పోలీస్ వాట్సాప్‌గ్రూప్ సభ్యులు రూ.లక్షా 50వేల 662ల ఆర్థిక సహాయం చేశారు. ఏపీ పోలీస్ వాట్సాప్ గ్రూపులోని సభ్యులు వితరణగా ఇచ్చిన మొత్తాన్ని మృతుడు హెచ్‌సీ రామునాయుడు కుటుంబ సభ్యులకు బుధవారం అందజేశారు. కార్యక్రమంలో గ్రూపు సభ్యులు లెంక రాము, మిత్తిరెడ్డి అప్పలనాయుడు, శీర గణేష్, అక్కుపల్లి గోవింద, మజ్జి కూర్మారావు, గొర్లె శ్రావణ్‌కుమార్, మీసాల చంద్రమౌళి, కల్యాణపు అప్పలనాయుడు, వైస్ ఎంపీపీ పిన్నింటి తమ్మునాయుడు తదితరులు పాల్గొన్నారు.
16న రాష్ట్రస్థాయి క్విజ్ పోటీలు
కొత్తవలస: మండలంలోని అప్పన్నపాలెం గ్రామంలో శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా 16వ తేదీన రాష్ట్రస్థాయి క్విజ్ పోటీలను నిర్వహించ నున్నట్లు ఉత్తరాంధ్ర క్విజ్ మాస్టర్ కర్రి రాము బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు 16వ తేదీన ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయన్నారు.అన్ని రకాల పోటీ పరీక్షలు రాసేందుకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అర్హులని తెలిపారు . ఆరుగురు అభ్యర్థులు ఒక గ్రూప్‌గా ఏర్పండి పోటీల్లో పాల్గొన వచ్చన్నారు. హైటెక్ విజయరహస్యం–2025 మ్యాగజైన్, ఇంగ్లీష్, కరెంట్ అఫెర్స్ తదితర అంశాలపై పోటీలు ఉంటాయన్నారు. పోటీల్లో గెలుపొందిన గ్రూప్‌లకు వరుసగా రూ.5వేలు, రూ.4వేలు, రూ 3వేలు, రూ.2వేలు నగదు బహుమతి ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.ఈ పోటీలు గ్రామ మాజీ సర్పంచ్ తిక్కాన చిన్నదేముడు ఆర్థిక సహాయంతో నిర్వహించనున్నట్లు చెప్పారు.
9న జిల్లా స్థాయి యోగా పోటీలు
విజయనగరం: జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 9న జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు అవనాపు విక్రమ్ బుధవారం తెలిపారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గల తోటపాలెం గాయత్రి టెక్నో స్కూల్‌లో ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. సబ్‌జూనియర్, జూనియర్, సీనియర్స్ విభాగాల్లో 8 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి ఎంపికలు జరుగుతాయని తెలిపారు. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు తమ పేర్లను 8వ తేదీ సాయంత్రం లోగా నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెంలో నిర్వహించే రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పాల్గొంటారని, రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారు, మైసూర్ (కర్ణాటక)లో నిర్వహించే జాతీయస్థాయి యోగా పోటీల్లో పాల్గొంటారని వివరించారు. జిల్లా స్థాయి యోగా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు పేర్ల నమోదు, మరిన్ని వివరాలకు ఫోన్ 8374904262,7993696087 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
చెక్‌బౌన్స్ కేసులో రెండేళ్ల జైలుశిక్ష
గజపతినగరం రూరల్: మిహిరా చిట్స్ యజమాని మక్కువ శ్రీధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయనగరం పట్టణానికి చెందిన కింతాడ అప్పారావుకు చెక్‌బౌన్స్ కేసులో రెండేళ్ల జైలుశిక్షతో పాటు రూ.రెండు లక్షలు నష్టపరిహారం విధిస్తూ గజపతినగరం జుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ విజయ్‌రాజ్‌కుమార్ తీర్పునిచ్చారు. మిహిరా చిట్ కంపెనీకి అప్పారావు సకాలంలో చిట్ నగదు చెల్లించకపోవడం వల్ల ముద్దాయికి ఈ శిక్ష వేసినట్లు మెజిస్ట్రేట్ తీర్పులో పేర్కొన్నారు.
గిరిజన బాలుడి మృతి
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని ఎల్విన్‌పేట పంచాయతీ ఎస్.కోటపాడు గ్రామానికి చెందిన కడ్రక అభిరాం(13)అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతిచెందాడు. కొత్తగూడ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి వరకు చదివిన అభిరాం టీబీ తదితర వ్యాధులతో బాధపడుతూ చికిత్స పొందుతున్న కారణంగా ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే పాఠశాలకు వెళ్లలేదు. తల్లి మాలతి, తండ్రి మహేష్ అభిరాంను వైద్యం నిమిత్తం పలు ఆస్పత్రులకు తీసుకెళ్లి వైద్య సేవలు అందించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని కుటుంబసభ్యులు పేర్కొన్నారు.