
దేశ రాజధాని పెద్దల దృష్టికి జిందాల్ సమస్య
శృంగవరపుకోట: భూములు కోల్పోయి ఉపాధి కరువై రోడ్డున పడిన జిందాల్ పరిశ్రమ నిర్వాసితుల గోడును దేశరాజధానికి తీసుకెళ్లామని ఎమ్మెల్సీ రఘురాజు చెప్పారు. ఈ మేరకు బుధవారం బొడ్డవరలో ఆయన తన స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 45రోజులు రైతులు రోడ్డున పడి ఆందోళన చేస్తుంటే స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, రాష్ట్ర సర్కారులో కనీస స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యకు పరిష్కారం చూపాలని, ఢిల్లీలో జాతీయ మానవహక్కుల సంఘం, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల కమిషన్ల చైర్మన్లను కలిసి జిందాల్ రైతాంగ సమస్యలు వివరించామన్నారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఇప్పటికే 15 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు చెప్పారు. కలెక్టర్‌ను కలిసి ఆర్‌అండ్‌ఆర్ అమలులో జరిగిన లోపాలు, చెల్లింపుల్లో తప్పిదాలను వివరించామన్నారు. జిందాల్ నిర్వాసితులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.