
నిందితుడి కోసం తీవ్ర గాలింపు
కొత్తవలస: మండలంలోని ముసిరాం గ్రామంలో నాటు తుపాకీతో తన సమీప బంధువును మంగళవారం సాయంత్రం కాల్చి పరారైన నిందితుడు సిమ్మ అప్పారావు (35) ఆచూకీ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఈ మేరకు ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగినట్లు సీఐ షణ్ముఖరావు తెలిపారు. ముసిరాం గ్రామానికి చెందిన సిమ్మ అప్పారావును అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం పాతవలసకు చెందిన సిమ్మ అప్పారావు మంగళవారం తుపాకీతో కాల్చి చంపిన విషయం పాఠకులకు విదితమే. నిందితుడు అప్పారావు తుపాకీతో కాల్చి తోటల్లోంచి పరెగెత్తుకుంటూ పోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి పరుగెత్తుకుంటూ అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం గొట్లాం గ్రామం రోడ్డువరకు ద్విచక్రవాహనంపై వెళ్లి అక్కడ బండి దిగి ముసిరాం గ్రామానికి చెందిన సిమ్మ అప్పారావును తుపాకీతో కాల్చి చంపేశానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడని నిందితుడి చినాన్న తెలిపాడు. కాగా తోటల్లోంచి వచ్చిన సమయంలో నిందితుడి వద్ద తుపాకీ లేదని తెలిపాడు. తుపాకీని తోటలోనే ఎక్కడో పడేశాడని పోలీసులు అంచనాకు వచ్చి వెతికేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించారు. ఉదయం నుంచి గ్రామం సమీపంలో గల జీడి, మామిడితోటల్లో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. పలు గ్రామాల్లో గల నిందితుడి బంధువుల ఇళ్లల్లోను తనిఖీ చేశారు. అయినా ఆచూకీ లభించలేదు. కాగా నిందితుడికి హెవీ వెహికల్ డ్రైవర్‌గా పని చేసిన అనుభవం ఉండడంతో గొట్లాం జంక్షన్ నుంచి ఇతర ప్రాంతానికి వెళ్లి పోయి ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. పోలీసులకు మాత్రం ఈ కేసు సవాల్‌గా మారింది. కాగా మృతుడు సిమ్మ అప్పారావు కుమారుడు అంజి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించామని సీఐ షన్ముఖరావు తెలిపారు.
సవాల్‌గా తీసుకున్న పోలీసులు