
పల్లెనిద్రతో ప్రజలకు భరోసా
విజయనగరం క్రైమ్: క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలను భాగస్వాములను చేయడమే లక్ష్యంగా ‘పల్లె నిద్ర’ కార్యక్రమం చేపట్టామని ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం తెలిపారు. ప్రతి నెలలో రెండు గ్రామాల్లో ’పల్లె నిద్ర’ చేయాలని ఎస్సైలు, సీఐలను ఆదేశించామని ఎస్పీ అన్నారు. ప్రజలతో మమేకమై, వారి సమస్యలను తెలుసుకుంటూ, వివిధ నేరాలు, చట్టాల మీద అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలోని ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలోగల గ్రామం లేదా వార్డులో ఎస్సై లేదా సీఐ స్థాయి అధికారులు, దత్తత గ్రామాల కానిస్టేబుల్స్ ‘పల్లె నిద్ర’ చేపట్టే విధంగా అధికారులను ఇప్పటికే ఆదేశించామని ఎస్పీ వకుల్ జిందల్ స్పష్టం చేశారు. ‘పల్లె నిద్ర’ కార్యక్రమంతో ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని పెంచుతున్నామన్నారు. నేరాల నియంత్రణ, ప్రజల సహకారంతో పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయడమే ‘పల్లె నిద్ర’ ప్రధాన లక్ష్యమన్నారు. జిల్లాలో ‘వల్లె నిద్ర’ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 300 గ్రామాల్లో పోలీసు అధికారులు కార్యక్రమం చేపట్టారని తెలిపారు.
ఎస్పీ వకుల్ జిందల్