
ఘనంగా గిరిజన వర్సిటీ 7వ వ్యవస్థాపక దినోత్సవం
విజయనగరం అర్బన్: పట్టణంలోని కేంద్రియ గిరిజనయూనివర్సిటీ 7వ వ్యవస్థాపక దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలను ప్రారంభించిన యూనివర్సిటీ ఇన్‌చార్జ్ వీసీ ప్రొఫెసర్ తంత్రవాహి శ్రీనివాసన్ మాట్లాడుతూ విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, ఉత్తమ బోధనల కోసం యూనివర్సిటీ అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది కృషిని ప్రశంసించారు. యూనివర్సిటీ భవిష్యత్ లక్ష్యాలను వివరించారు. ముఖ్యఅతిథిగా హాజరైన భువనేశ్వర్‌కు చెందిన రాజకీయ విశ్లేషకుడు, మాజీ అధ్యాపకుడు డాక్టర్ అభిరాం బిశ్వాల్ మాట్లాడుతూ యూనివర్సిటీ స్థిరమైన అభివృద్ధి కోసం అనుసరించాల్సిన అంశాలు, ప్రగతి శీల విధానాలు, విద్యా ప్రమాణాల పరిరక్షణ, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా మార్గదర్శక సూత్రాలను పాటించాలని సూచించారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జితేంద్రమోహన్ మిశ్రా యూనివర్సిటీ గణాంకాలను ప్రస్తావిస్తూ మౌలిక వసతులతో కూడిన శాశ్వత క్యాంపస్‌కు విద్యార్థులను త్వరలో తరలిస్తామన్నారు. అనంతరం వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలను ముఖ్యఅతిథి అందజేశారు. డీన్ ఆఫ్ స్టూడెంట్ వెల్ఫేర్ డాక్టర్ బొంతు కోటయ్య సమన్వయకర్తగా వ్యవహరించిన కార్యక్రమంలో డీన్ ఆఫ్ సోషల్ హ్యుమానిటీస్ అండ్ సైన్సెస్ ప్రొఫెసర్ శరత్చంద్రబాబు, పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ దీపక్ మోహన్‌రావు షిండే, లైబ్రేరియన్ డాక్టర్ శంకర్‌రెడ్డి కొల్లే, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.