
పోలీసు కుటుంబానికి ‘చేయూత’
● మృతిని భార్యకు రూ.1,48,600 చెక్కు అందజేత
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీసుశాఖలో ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేసి, ఇటీవల అనారోగ్య కారణంతో మృతి చెందిన నర్సింహ పట్నాయక్ కుటుంబానికి పోలీస్ సిబ్బంది ‘చేయూత‘ కింద రూ.1,48,600 చెక్కును ఆయన సతీమణి స్వర్ణలత పట్నాయక్‌కు ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖలో పని చేస్తూ ఎవరైనా ప్రమాదవశాత్తు లేదా అనారోగ్యంతో మరణించిన ఆయా కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ‘చేయూత ‘పథకం ఆర్థిక సాయం అందిస్తోందన్నారు. శాఖలో ప్రతి సిబ్బంది కొంత నగదును పోగు చేసి, వారి కుటుంబాలకు చేయూతగా అందజేయడం ఎప్పటినుంచో వస్తోందని ఈ తరహా పని చాలా అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఏఓ పి.శ్రీనివాసరావు, ఆఫీసు సూపరింటెండెంట్ టి.రామకృష్ణ, పోలీసు కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.