
రైతన్నకు సాగు భరోసా ఏదీ?
సాలూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతన్నకు సాగుభరోసా కరువైందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు పీడిక రాజన్నదొర అన్నారు. సాలూరు పట్టణంలో స్థానిక విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడారు. చంద్రబాబునాయుడు 2024 జూన్ నుంచి రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలుచేస్తామని మేనిఫెస్టోలో పేర్కొని 2025లో అమలుచేశారన్నారు. అదికూడా రూ.20 వేలు ఇస్తామని చెప్పి తొలివిడతగా కేవలం రూ.5వేలు మాత్రమే వేశారన్నారు. గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ రైతుభరోసా పథకం కింద 53లక్షల58 వేల మందికి లబ్ధి చేకూరితే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో అన్నదాత సుఖీభవ కింద 46.85 లక్షల మంది రైతులకు మాత్రమే ఇస్తున్నట్లు ప్రకటించారన్నారు. మిగిలిన 6.73 లక్షల మంది రైతులు ఏమయ్యారని, సాగు విడిచి వలస వెళ్లిపోయారా అని ప్రశ్నించారు. చాలామంది రైతుల ఖాతాలకు పెట్టుబడి సాయం ఇంకా పడలేదన్నారు.
నాడు విమర్శించిన మీరు నేడు ఏం చేస్తున్నారు?
గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రైతుభరోసా కింద ఏడాదికి రూ.13,500 అందిస్తే... రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం డబ్బులు ఇవ్వాలని నాడు విమర్శించిన చంద్రబాబు నేడు అన్నదాత సుఖీభవ కింద ఎందుకు రూ. 20 వేలు ఇవ్వడంలేదని రాజన్నదొర ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబుకు సిగ్గులేదని అనాలా అంటూ విమర్శించారు. గత ప్రభుత్వం ఏడాదికి రైతు భరోసా కింద రూ.12,500 ఇస్తామని చెప్పి మరో రూ.1000 పెంచి రూ.13,500 అందజేసిందన్నారు. ఉచిత పంటల బీమా పథకంతో రైతాంగాన్ని ఆదుకుందన్నారు. డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేసిందన్నారు.
యూరియా కోసం రైతులును
రోడ్డెక్కించిన ఘనత ఎవరిది?
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతులకు ఎరువుల కొరత లేదని, ఆర్‌బీకేల వద్ద ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉండేవని రాజన్నదొర తెలిపారు. నేటి కూటమి పాలనలో రైతులకు ఎరువుల దొరకక ధర్నాలు చేయాల్సి వస్తోందన్నారు. యూరియా కోసం రైతులను రోడ్డెక్కించిన ఘనత ఎవరిదో రైతులే చెప్పాలన్నారు.
కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర