
కలెక్టర్ వద్దకు మున్సిపల్ పంచాయితీ!
● కమిషనర్ వర్సెస్ ఉద్యోగులు ● చోద్యం చూస్తున్న ‘పెద్దన్న’లు ● రోజురోజుకూ జఠిలమవుతున్న వివాదం
సాక్షి, పార్వతీపురం మన్యం:
పార్వతీపురం పురపాలక సంఘంలో కమిషన ర్ వెంకటేశ్వర్లు, ఉద్యోగుల మధ్య వివాదం రోజురోజుకూ జఠిలమవుతోంది. ఇప్పటికే పలు దఫాలు ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. కమిషనర్ తీరును ఎండగట్టారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయ్‌చంద్రను కలిసి వినతిపత్రం అందజేశారు. కమిషనర్ వెంకటేశ్వర్లు తమను ఏవిధంగా ఇబ్బంది పెడుతున్నదీ వివరించారు. ప్రతి పనికీ రే టు కట్టేసి.. ప్రజల నుంచే కాక, స్వయంగా సిబ్బంది వద్ద కూడా వసూలు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చి న మొత్తంలో ఎమ్మెల్యేకు, ఉన్నతాధికారులకు ఇవ్వాలని బహిరంగంగానే కమిషనర్ చెబుతున్న ట్లు సాక్షాత్తు శాసనసభ్యులు విజయ్‌చంద్ర వద్దే ప్రస్తావించారు. కొన్ని నెలలుగా కమిషనర్ వెంకటేశ్వర్లు తీరుతో ఎంతోమంది విసుగు చెందుతున్నా.. సయోధ్యకు ఏ ఒక్కరూ ప్రయత్నించకపోవడం గమనార్హం.
పాలకవర్గానికీ కమిషనర్ తీరుతో ఇబ్బందులు
పార్వతీపురం పురపాలక సంఘం కమిషనర్ వెంకటేశ్వర్లు తరచూ వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ పాలకవర్గాన్నీ లెక్క చేయక, ప్రోటోకాల్ పాటించక పక్కా టీడీపీ కార్యకర్త మాదిరి పని చేస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ప్రధానంగా వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్లు, సభ్యులే లక్ష్యంగా.. వారికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనిపై పాలకవర్గ సభ్యులు ఉన్నతాధికారులకూ ఫిర్యాదు చేశారు. కొద్దిరోజులు ఆ శాఖ ఆర్డీ కూడా విచారణ జరిపారు. ఆ సమయంలోనూ వివిధ వర్గాల నుంచి కమిషనర్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదులు వెళ్లాయి.
నలిగిపోతున్న ఉద్యోగులు
మరోవైపు కమిషనర్ తీరుతో కార్యాలయ ఉద్యోగులూ నలిగిపోతున్నారు. కార్యాలయం దగ్గర పలుమార్లు ఆందోళన చేశారు. పెన్‌డౌన్ చేపట్టారు. చైర్‌పర్సన్ గౌరీశ్వరికి ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే కు మొర పెట్టుకున్నారు. చివరికి సోమవారం పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. కమిషనర్ అవినీతిని, తమ పట్ల ఆయన వైఖరిని ఎండగట్టారు.
కమిషనర్‌కు ఎమ్మెల్యే అండ?
మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లుకు స్థానిక ఎమ్మెల్యే అండ పుష్కలంగా ఉందన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే ప్రోద్భలంతోనే ఆయనను ఇక్కడ నియమించారని చెబుతుంటారు. అందువల్లే ఎవరెన్ని ఫిర్యాదులు చేస్తున్నా ఆయనపై చర్యలు
తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కనీసం ఇరువర్గాల మధ్య సయోధ్యకు కూడా ప్రయత్నించకపోవడం
గమనార్హం. ఈ ప్రభావం మున్సిపాలిటీ అభివృద్ధి మీద పడుతున్నా.. వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యంగా వ్యవహరిస్తుండటంపై సర్వత్రా
విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి కలెక్టర్ అయినా జోక్యం చేసుకుని, దీనికి పరిష్కారం చూపుతారో, లేదో చూడాలి.