
అర్జీదారులకు రుచికర భోజనం
● కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌కు వచ్చే ప్రజల కోసం ఉచితంగా ఏర్పాటు ● దాతల సహకారంతో నిర్వహణ: కలెక్టర్
పార్వతీపురం రూరల్: ప్రతి సోమవారం జిల్లా నలుమూలల నుంచి తమ సమస్యల పరిష్కారం కోరుతూ వందలాది మంది అర్జీదారులు కలెక్టరేట్ కు వస్తుంటారు. ఉన్నతాధికారులను తమ గోడు వినిపించి, వినతిపత్రాలు అందిస్తారు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో కొండకోనలు, మారుమూల పల్లెల నుంచి వేకువ జామునే బయల్దేరి, వందలా ది కిలోమీటర్లు ప్రయాణించి జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. తిరిగి చీకటిపడ్డాకే ఊళ్లకు చేరేది. రాకపో కలకు ప్రయాణ ఖర్చులే కాక.. భోజనానికీ ఒక్కో సారి ఇబ్బందులు పడుతుంటారు. బయట హోటళ్లలో తినాలంటే ఒక్కొక్కరికీ రూ.60 నుంచి రూ. 100 వరకు ఖర్చు పెట్టాల్సిందే. అంత వ్యయం పెట్టుకోలేక ఆకలితోనే ఎంతోమంది తిరుగు ప్రయాణమవుతుంటారు. ఇటువంటి వారి ఇబ్బందులను గుర్తించిన కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్.. దూర ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులకు రుచి, శుచికర ఆహారాన్ని ఉచితంగానే అందించాలని నిర్ణయించారు. కలెక్టరేట్ ఆవరణలో సోమవారం ఉచి త భోజనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐటీడీ ఏ పీవో అశుతోష్ శ్రీవత్సవ, జిల్లా రెవెన్యూ అధికారిణి హేమలలతో కలిసి కాసేపు అర్జీదారులకు భోజ నం వడ్డించారు.
పేదల ఆకలి తీర్చాలనే..
ప్రతి సోమవారం కలెక్టరేట్‌కు దూర ప్రాంతాల నుంచి ఎంతోమంది పేదలు వినతి పత్రాలు ఇవ్వడానికి వస్తుంటారు. ఆకలితోనే తిరుగు ప్రయాణమై, ఏ రాత్రికో ఇంటికి చేరుకుంటా రు. అటువంటి వారికోసమే ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇక మీదట అర్జీదారులు ఉచితంగానే ఇక్కడ భోజనం చేసి వెళ్లొచ్చు. ప్రతి వారం సుమారు 500 మంది వరకూ తిని, వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకోసం దాతలు ముందుకు రావాలి. ఎవరైనా వారికి తోచిన రీతిలో సహాయం అందిస్తే అన్నదాన కార్యక్రమానికి తోడ్పడినవారవుతారు.
– ఎ.శ్యామ్‌ప్రసాద్, కలెక్టర్