
సగమే సెక్యూరిటీ..!
● ఎంఓయూ జరిగి రెండు నెలలైనా పూర్తిస్థాయిలో జరగని గార్డుల
నియామకం
● 58 మందిసెక్యూరిటీ గార్డులకు విధుల్లో 23 మంది
● సెక్యూరిటీ పూర్తిస్థాయిలో లేక కానరాని భద్రత
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కావడంతో జిల్లా ఆస్పత్రి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగా మారింది. దీంతో ఆస్పత్రిలో వైద్యసిబ్బందితో పాటు, వసతులు కూడా పెరిగాయి. ఈ క్రమంలో ఓపీ సంఖ్య పెరిగింది. అయితే ఆస్పత్రికి, రోగులు, వైద్యసిబ్బందికి భద్రత మాత్రం పూర్తి స్థాయిలో లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్వజన ఆస్పత్రికి నిబంధన ప్రకారం ఉండాల్సిన సెక్యూరిటీ గార్డుల్లో సగం సిబ్బంది మాత్రమే ఉన్నారు. దీంతో వారు ఆస్పత్రి అంతటికీ భద్రత కల్పించలేక పోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి సర్కార్ వచ్చిన తర్వాత సెక్యూరిటీ ఏజెన్సీని కూడా మార్చేసింది.
గతంలో కాటలాండ్ సెక్యూరిటీ ఏజెన్సీవారు బాధ్యతలు నిర్వహించేవారు. కూటమి సర్కార్ ఆ ఏజెన్సీని తప్పించి శ్రీ కార్తికేయ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించింది.
58మంది సెక్యూరిటీ గార్డులకు ఎంఓయూ
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి నూతన నిబంధన ప్రకారం 58మంది సెక్యూరిటీ గార్డులు ఉండాలని సర్వజన ఆస్పత్రి వైద్యాధికారులు సెక్యూరిటీ ఎజెన్సీతో ఎంఓయూ చేసుకున్నారు. అగ్రిమెంట్ మే నెలలో జరిగింది. జూన్ నెల 1వతేదీ నుంచి 58 మంది సెక్యూరిటీ గార్డులను సెక్యూరిటీ ఏజెన్సీ సరఫరా చేయాల్సి ఉంది. అగ్రిమెంట్ జరిగి రెండు నెలలు కావస్తున్నా ఇంతవరకు పూర్తిస్థాయిలో సెక్యూరిటీ గార్డులను సరఫరా చేయలేదు. ప్రస్తుతం ఆస్పత్రిలో 23 మంది సెక్యూరిటీ గార్డులు, ఇద్దరు సెక్యూరిటీ సూపర్‌వైజర్స్ విధులు నిర్వర్తిస్తున్నారు.
గార్డులను సరఫరా చేయక పోవడం వెనుక..
జూన్ ఒకటో తేదీ నుంచి సెక్యూరిటీ గార్డులు పూర్తిస్థాయిలో ఆస్పత్రిలో పనిచేయాల్సి ఉంది. అయినప్పటికీ సగం మందితో పనిచేయిస్తున్నారు. దీని వెనుక మతలబు ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తక్కువ మందితో పనిచేసినప్పటికీ పూర్తి స్థాయిలో సెక్యూరిటీ గార్డులు పనిచేస్తున్నట్లు చూపించి నిధులు కొట్టేయడానికే ప్లాన్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సగం మందితో పనిచేయించడం వల్ల నెలకు రూ.లక్షల్లో మిగులుతుంది. ఈ ఉద్దేశంతో పూర్తిస్థాయి సిబ్బందిని నియమించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఒకటి రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో గార్డులు
సర్వజన ఆస్పత్రి సెక్యూరిటీ నిర్వహణ శ్రీ కార్తికేయ సెక్యూరిటీ ఏజెన్సీకి వచ్చింది. మే నెలలో ఎంఓయూ జరిగింది. జూన్ ఒకటో తేదీ నుంచి 58 మంది సెక్యూరిటీ గార్డులతో పనిచేయించాలని ఎంఓయూ జరిగింది. ప్రస్తుతం 23 మంది గార్డులు, ఇద్దరు సూపర్‌వైజర్లు పనిచేస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో పూర్తిస్థాయి సెక్యూరిటీ గార్డులను సరఫరా చేస్తామని ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు.
డాక్టర్ శంబంగి అప్పలనాయుడు, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి

సగమే సెక్యూరిటీ..!