గంజాయి నియంత్రణే లక్ష్యంగా తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

గంజాయి నియంత్రణే లక్ష్యంగా తనిఖీలు

Aug 4 2025 3:49 AM | Updated on Aug 4 2025 3:49 AM

గంజాయి నియంత్రణే లక్ష్యంగా తనిఖీలు

గంజాయి నియంత్రణే లక్ష్యంగా తనిఖీలు

విజయనగరం క్రైమ్‌: గంజాయి అక్రమ రవాణా నియంత్రణే లక్ష్యంగా ట్రైన్‌లో లోకల్‌ పోలీసులు, జీఆర్పీ, ఈగల్‌, ఆర్పీఎఫ్‌ సిబ్బంది డాగ్‌ స్క్వాడ్‌తో సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు ఎస్పీ వకుల్‌ జిందల్‌ ఆదివారం చెప్పారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాలతో గంజాయి అక్రమ రవాణాను నియంత్రించేందుకు ఐదు పోలీసు బృందాలు సంయుక్తంగా కిరండోల్‌ పాసింజర్‌ ట్రైన్‌లో శనివారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారన్నారు. ఒడిశా రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు గంజాయి అక్రమంగా రవాణా అవుతోందన్న సమాచారంతో ప్రత్యేకంగా రైళ్లలో తనిఖీలు చేపట్టామన్నారు. ఈ సందర్భంగా విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, ఎస్‌.కోట సీఐ వి.నారాయణమూర్తిలు ముందుగా ప్రయాణికులకు చేస్తున్న తనిఖీల గురించి వివరించి, వారు నిర్వర్తించే విధుల గురించి దిశా నిర్దేశం చేశారన్నారు. అన్ని భోగీల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి, నార్కోటిక్‌ డాగ్‌ స్క్వాడ్‌ సహాయంతో క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో ఆరు కిలోల గంజాయి, ఒక వ్యక్తి నుంచి కిలోన్నర గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగం గురించి సమాచారాన్ని టోల్‌ ఫ్రీ నంబరు 1972కుఅందించాలని ఎస్పీ వకుల్‌ జిందల్‌ ప్రజలను కోరారు. ఈ తనిఖీల్లో వల్లంపూడి ఎస్సై ఎస్‌.సుదర్శన్‌ ఆర్పీఎఫ్‌ ఎస్సై పి.శ్రీనివాసరావు డాగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది, ఈగల్‌ టీమ్‌ పోలీసులు, 40మంది పోలీసు అధికారులు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

ఏడున్నర కేజీల గంజాయి లభ్యం

జీఆర్పీకి చిక్కిన పల్నాడు వాసి

రైలులో గంజాయి అక్రమ రవాణా

విశాఖ నుంచి కిరండోల్‌ వెళ్తున్న ప్యాసింజర్‌ ట్రైన్‌లో గంజాయి అక్రమ రవాణాను గవర్నమెంట్‌ రైల్వే పోలీసులు ఆదివారం అడ్డుకున్నారు. జీఆర్పీ ఎస్సై బాలాజీ రావు తన సిబ్బందితో కలిసి కిరండోల్‌ రైలులో సోదాలు చేస్తుండగా ఓ వ్యక్తి కొత్తవలసలో రైలు దిగి పారిపోతూ అడ్డంగా దొరికిపోయాడు. పల్నాడు జిల్లా వినుకొండ మండలం ముందలమూరివారిపాలానికి చెందిన తన్నేరు ఏసుబాబు ఒడిశాలో కొనుగోలు చేసి బెంగళూరుకు 1.133కేజీల గంజాయిని తరలిస్తూ చిక్కాడని ఎస్సై బాలాజీ రావు తెలిపారు. ఈ మేరకు నిందితుడు ఏసుబాబుపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసి విశాఖ రైల్వే కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement