
ఎంతో ఎదుగుతావనుకుంటే..!
పాలకొండ రూరల్: ఇప్పుడే వచ్చేస్తానని చెప్పి..తిరిగిరాని లోకానికి వెళ్లిపోయావా నాన్నా..అంటూ మృతుడి తల్లిదండ్రుల రోదనలు గ్రామస్తులను కంటతడి పెట్టించాయి. భవన నిర్మాణ కార్మికుడైన ఆ తండ్రి తన రెక్కల కష్టంతో పిల్లలను, కుటుంబాన్ని సాకాడు. ఎదుగుతున్న పిల్లలు ఉన్నత చదువులు చదవాలకున్నాడు. భార్య భారతి సహకారంతో పిల్లలకు కష్టం తెలియకుండా కుమార్తె యమున డిగ్రీ, కుమారుడు దుర్గాప్రసాద్(18) ఇంటర్ చదువుతుండడంతో కష్టం మరిచి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. విధి చిన్న చూపు చూసి వారి ఏకై క కుమారుడిని నాగావళి నది కబళించి ఆ కుటంబంలో తీరని శోకం నింపింది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
పాలకొండ నగరపంచాయతీలోని బల్లంకి వీధిలో నివాసముంటున్న శాసుబిల్లి రాము, భారతి దంపతులకు ఇద్దరు పిల్లలు. భవన నిర్మాణ పనులు చేస్తున్న రాము పిల్లలను చదువులవైపు నడిపించాడు. కుమార్తె డిగ్రీ చదువుతుండగా, కుమారుడు దుర్గాప్రసాద్ స్థానికంగా ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం స్నేహితుల దినోత్సవం కావడంతో మిత్రులతో కలిసి దుర్గాప్రసాద్ బయటకు వెళ్లాడు. అప్పటి వరకూ తమతో కలిసి ఉన్న కుమారుడు స్నేహితులతో ఉన్నాడని భావించిన తల్లిదండ్రులకు మధ్యాహ్నానికి వచ్చిన పిడుగులాంటి వార్త వారు ఉన్నచోట కుప్పకూలేలా చేసింది. ఒక్కసారిగా తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. తమ ఒక్కగానొక్క కుమారుడు ఏడుగురు స్నేహితులతో కలిసి సమీప శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం నారాయణపురం ఆనకట్ట సమీపంలో నాగావళి నది వద్దకు వెళ్లాడని, అక్కడ స్నానం చేసే క్రమంలో దుర్గాప్రసాద్ నదిలో చిక్కుపోవడం, రక్షించే యత్నంలో స్నేహితులు విఫలం కావడంతో సమీపంలో ఉన్న లాబాం గ్రామస్తుల సాయం కోరగా గ్రామస్తులు రక్షించే యత్నం చేస్తున్న క్రమంలో విగతజీవిగా దుర్గాప్రసాద్‌ను నదిలో గుర్తించారని తెలిసి షాక్‌కు గురయ్యామని మృతుడి తండ్రి రాము వాపోయాడు.
రూ.200 ఫోన్‌పే చేశాను..
నాన్నా..నేను ఫ్రెడ్స్‌తో కలిసి బయటకు వచ్చానని, బిర్యానీ తినేందుకు రూ.200 కావాలని ఫోన్ చేయడంతో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తండ్రి రాము కుమారుడికి ఫోన్ పే చేసి నాన్నా జాగ్రత్త అని చెప్పాడు. త్వరగా ఇంటికి వచ్చేయాలన్నాడు. ఇంతలోనే ఘోరం జరిగిందని మృతుడి తండ్రి రాము చెబుతూ గుండెలవిసేలా రోదించిన తీరు అందరినీ కలిచివేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని మిగిలిన ఏడుగురు స్నేహితులు క్షేమంగా ఉన్నారని బూర్జ ఎస్సై ఎం.ప్రవల్లిక తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు పోలీసులు తరలించారు.
తిరిగిరాని లోకానికి వెళ్లిపోయావా నాన్నా..
మిన్నంటిన తల్లిదండ్రుల రోదనలు
కంటతడి పెట్టిన గ్రామస్తులు

ఎంతో ఎదుగుతావనుకుంటే..!