
గిరిజన రైతులకు పట్టాలివ్వాలి
రామభద్రపురం:
గిరిజన రైతులు సాగు చేసిన భూములకు పట్టాలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు రామభద్రపురం మండలంలోని కాకర్లవలస, కారేడువలస గిరిజన రైతుల సాగు భూములను దౌర్జన్యంగా లాక్కోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ కాకర్లవలస గ్రామంలో గిరిజన రైతులతో కలిసి ఆదివారం ఆయన ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం లేకుండా గిరిజనుల భూములు అక్రమంగా లాక్కోవడం చట్ట విరుద్ధమన్నారు. కాకర్లవలస, కారేడువలస గిరిజన రైతుల సాగు భూములను అక్రమంగా స్వాధీనం చేసుకోవడానికి ఎవరు వచ్చినా సహించేది లేదన్నారు.అధికార బలంతో గిరిజనులపై దౌర్జన్య కాండను ఆపకుంటే వామపక్షాలన్నీ ఏకమై గిరిజనుల పక్షాన పోరాటాలు ఉధృతం చేస్తాయని హెచ్చరించారు. గిరిజన రైతులు ఆరుగాలం కష్టపడి సాగు చేసిన మామిడితోటలు, జీడితోటలు, మొక్కజొన్న పంటలను ధ్వంసం చేసిన ఏపీఐఐసీ అధికారులు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల నాయకుడు బలస శ్రీనివాసరావు పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని
సూర్యనారాయణ