ఆస్తికోసమే హత్య | - | Sakshi
Sakshi News home page

ఆస్తికోసమే హత్య

Aug 1 2025 12:17 PM | Updated on Aug 1 2025 12:17 PM

ఆస్తికోసమే హత్య

ఆస్తికోసమే హత్య

శృంగవరపుకోట: మండలంలోని పల్లపుదుంగాడలో ఇటీవల సంభవించిన హత్య కేవలం ఆస్తి కోసమే జరిగినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హత్యకేసు వివరాలను డీఎస్పీ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తన తండ్రి సీదిరి రాములును తన పెదనాన్న కొడుకై న నాగులు నాటుతుపాకీతో 28వ తేదీ సాయంత్రం కాల్చి చంపినట్లు హతుడి కుమార్తె పల్లపుదుంగాడకు చెందిన బడ్నాన నాగమణి ఈనెల 29న మధ్యాహ్నం ఫిర్యాదు చేసిందని చెప్పారు. దీంతో ఎస్‌కోట సీఐ నారాయణమూర్తి, ఎస్సై చంద్రశేఖర్‌లు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారన్నారు. మృతుడు సీదిరి రాములుకు నాగులుకు మధ్య ఆస్తి వివాదాలున్నాయి. రాములుకు మగపిల్లలు లేనందున చిట్టంపాడులో రెండెకరాల పొలం తనకు ఇచ్చేయాలని నాగులు కొంత కాలంగా పినతండ్రిని అడుగుతున్నాడు. అ భయంతో రాములు మూడేళ్లుగా పల్లపుదుంగాడలో కుమార్తె వద్ద ఉంటున్నాడు. 28న సాయంత్రం పల్లపుదుంగాడ పొలాల్లో రాములు పని చేస్తుండగా నాగులు తన వద్ద ఉన్న తపంచాతో పినతండ్రి రాములుపై కాల్పులు జరిపాడు. దీంతో రాములు పొలంలోనే చనిపోయాడని డీఎస్పీ చెప్పారు. నిందితుడు నాగులు కోసం గాలిస్తుండగా సీఐకి అందిన సమాచారంతో గురువారం ఉదయం ఐతన్నపాలెం జంక్షన్‌లో అనుమానాస్పదంగా నడుచుకుంటూ వస్తుండగా అదుపులోకి తీసుకున్నారన్నారు. నిందితుడిని విచారణ చేసి బొడ్డవర రైల్వేస్టేషన్‌ సమీపంలో తుప్పల్లో దాచిన తపంచా, దుస్తులు పోలీసులు స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారని చెప్పారు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామని వివరించారు. కేసును త్వరగా ఛేదించిన ఎస్‌.కోట సీఐ నారాయణమూర్తి, ఎస్సై చంద్రశేఖర్‌లను డీఎస్పీ అభినందించారు.

డీఎస్పీ శ్రీనివాస రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement