వెకిలి నవ్వులు.. వెక్కిరింతలు! | - | Sakshi
Sakshi News home page

వెకిలి నవ్వులు.. వెక్కిరింతలు!

Aug 1 2025 12:15 PM | Updated on Aug 1 2025 12:15 PM

వెకిల

వెకిలి నవ్వులు.. వెక్కిరింతలు!

సాక్షి, పార్వతీపురం మన్యం: అంతా ఊహించినట్లే జరిగింది. పార్వతీపురం మున్సిపల్‌ సమావేశం ఎప్పటిలాగే గురువారం వాడీవేడిగా సాగింది. ప్రథమ పౌరురాలు అన్న గౌరవం ఇవ్వకుండా.. కనీస సభామర్యాద పాటించక..కూటమి కౌన్సిలర్లు, ఫిరాయింపు కౌన్సిలర్లు..మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోను గౌరీశ్వరిని అగౌరవపరిచారు. వెకిలి నవ్వులు, వెక్కిరింతలతో సభాగౌరవాన్ని మంటగలిపారు. ఎమ్మెల్యే బోనెల విజయ్‌చంద్ర సమక్షంలోనే ఈ తంతు సాగగా..మరోమారు మున్సిపల్‌ కమిషనర్‌ తాను అధికార పార్టీ మనిషినే అని నిరూపించుకున్నారు. పార్వతీపురం పురపాలక సంఘం సాధారణ సమావేశాన్ని చైర్‌పర్సన్‌ బోను గౌరీశ్వరి అధ్యక్షతన గురువారం నిర్వహించారు. సమావేశపు అజెండాలోని 1, 2, 12 అంశాలను ఆమోదించాలని టీడీపీ కౌన్సిర్లు పట్టుపట్టారు. ఏకపక్షంగా ఉన్న ఈ అంశాలను ఆమోదించేదిలేదని చైర్‌పర్సన్‌ స్పష్టం చేశారు. పట్టణంలోని నైట్‌షెల్టర్‌ను రేజేటి దయామణికి కాకుండా, మరొకరికి ఇవ్వాలని పలువురు సభ్యులు డిమాండ్‌ చేశారు. గతంలో ఇదే అంశాన్ని ఆమోదించిన కొందరు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు..ఇటీవల టీడీపీలోకి ఫిరాయించిన తర్వాత, మాట మార్చి రద్దు చేయాలని పట్టుబట్టడం గమనార్హం. దీంతోపాటు, మున్సిపాలిటీలో 23 మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల తొలగింపు అంశాన్ని కూడా ఆమోదించాలని ఒత్తిడి తెచ్చారు. పట్టణానికి చెందిన టీడీపీ నాయకుడు జయబాబు నిర్వహిస్తున్న డాక్యుమెంట్‌ రైటింగ్‌ స్థలాన్ని మరో 25 ఏళ్లపాటు లీజు రెన్యువల్‌ చేయాలని అజెండాలో పొందుపరిచారు. ఈ లీజు గడువు ముగిసిపోవడంతో రెన్యువల్‌ కోసం జయబాబు దరఖాస్తు చేసుకున్నారు. వాటన్నింటినీ అజెండాలో పొందుపరచడంతో చైర్‌పర్సన్‌ తిరస్కరించారు. తమకే సభలో మెజారిటీ ఎక్కువ ఉందని.. తామే ఆమోదింపజేసుకుంటామని కూటమి కౌన్సిలర్లు, ఫిరాయింపు కౌన్సిలర్లు తేల్చిచెప్పారు. దీంతో చైర్‌పర్సన్‌ సభ నుంచి వాకౌట్‌ చేసి బయటకు వెళ్లిపోయారు. సమావేశం మొత్తం కూటమిలోని కౌన్సిలర్లు..చైర్‌పర్సన్‌ను అవహేళన చేస్తూ మాట్లాడడం కనిపించింది. ఆమెను అగౌరవపరిచేలా మాట్లాడుతూ, వెకిలి నవ్వులతో సమావేశాన్ని పక్కదారి పట్టించేందుకు, వివాదం చేసేందుకు ప్రయత్నించారు. మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు కూడా అధికార పార్టీ వ్యక్తిలా వ్యవహరించారు. సమావేశం అనంతరం మీడియాతో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ నైట్‌ షెల్టర్‌ నిర్వాహకురాలు దయామణి చైర్‌ పర్సన్‌ బోను గౌరీశ్వరి బంధువని ఆరోపించారు. అభివృద్ధిని చైర్‌పర్సన్‌ అడ్డుకుంటున్నారంటూ విమర్శించారు.

ఎమ్మెల్యే సమక్షంలోనే ప్రథమ పౌరురాలికి అవమానం

తీరుమారని మున్సిపల్‌ సమావేశం

అధికార పార్టీకి కొమ్ముకాసిన కమిషనర్‌

ప్రతి పనికీ కమిషనర్‌కు ఓ రేటు..ఎమ్మెల్యేకూ వాటా

మరోవైపు మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు తీరుపై ఫిర్యాదులు వస్తున్నా చర్యలు కానరావడం లేదు. తాజాగా మరోసారి మున్సిపల్‌ ఉద్యోగులు..ఆయన వైఖరిపై స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. తీవ్ర పదజాలంతో దుర్భాషలాడుతూ అగౌరవ పరుస్తున్నారని పేర్కొన్నారు. సిబ్బంది పెండింగ్‌ బిల్లులు చెల్లించడం లేదని, సీట్ల కేటాయింపునకు..బదిలీ అయిన సిబ్బందిని రిలీవ్‌ చేయడానికి డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నట్లు ఆరోపించారు. అవసరం నిమిత్తం రెండు రోజులు సెలవు కావాలని అడిగినా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. ఉద్యోగులతో సంబంధం లేకుండా కొన్ని ఫైళ్లను, లావాదేవీలను నేరుగా ఇంటికే పిలిపించుకుని మాట్లాడుకుంటున్నారని.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిపై తమను సంతకం చేయాలని ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు.

కార్యాలయంలో ఏ పని జరగాలన్నా ఒక రేటు నిర్ణయించేశారని..ఎవరైనా అడిగితే, తాను స్థానిక ఎమ్మెల్యేకు కూడా కొంతమొత్తం ఇవ్వాలని బహిరంగంగానే అంటున్నట్లు తెలిపారు. ఆయనను తక్షణమే ఇక్కడ నుంచి బదిలీ చేయాలని కోరారు.

వెకిలి నవ్వులు.. వెక్కిరింతలు!1
1/1

వెకిలి నవ్వులు.. వెక్కిరింతలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement