సీతంపేట: స్థానిక వ్యవసాయపరిశోధన స్థానం సైంటిస్టులు, వ్యవసాయ శాఖాధికారులు గురువారం క్షేత్రపర్యటన చేశారు. ఈ సందర్బంగా ఈ ప్రాంతానికి అనువైన వంగడాలు ఏవి? పండిస్తున్న పంటల్లో తెగుళ్ల నివారణ చర్యలపై చర్చించారు. వరి, రాగులు, ఇతర ముఖ్యమైన ఖరీఫ్ పంటల దిగుబడికి తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో రస్తాకుంటుబాయి కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్.ధ్రువ, శాస్త్రవేత్తలు స్రవంతి, విహారి, స్థానిక శాస్త్రవేత్త పి.సౌజన్య, ఏడీఏలు, వ్యవసాయశాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.
4.2 కేజీల బాల భీముడి జననం
పార్వతీపురం టౌన్: జిల్లా ఆస్పత్రిలో గురువారం ఓ గర్భిణి 4.2 కేజీల బరువు గల మగశిశువును ప్రసవించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వైద్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం మండలం టోంకి గ్రామానికి చెందిన ఎ.లలితకు పురిటి నొప్పులు రావడంతో వెంటనే కుటుంబసభ్యులు జిల్లా ఆస్పత్రిలో చేర్చారు. సీనియర్ గైనకాలజిస్టు డాక్టర్ నాగశివజ్యోతి వైద్య బృందంతో సాధారణ డెలివరీ చేయగా 4.2 కేజీల బరువు ఉన్న మగబిడ్డ జన్మించాడు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండడంతో బంధువులు ఆనందం వ్యక్తం చేశారు.
నేడు పింఛన్ల పంపిణీ
● కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్
పార్వతీపురం రూరల్: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఎన్‌టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఒక ప్రకటన జారీ చేశారు. జిల్లాలోని 1,40,672 మందికి రూ.60,10,27,500 నిధులను పింఛన్ల కింద పంపిణీ చేయనున్నామన్నారు. ఇందులో కొత్తగా మంజూరైన 1634 మంది వితంతు పింఛన్లు ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఉదయం 6గంటలకే పంపిణీ ప్రారంభమవుతుందని మొదటి రోజే శతశాతం పంపిణీకి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
ఇదెక్కడి అన్యాయం?
రాజాం సిటీ: రాజాం బస్టాండ్ ఆవరణలోని నవదుర్గా ఆలయానికి ఏళ్ల తరబడి చైర్మన్‌గా కొనసాగుతున్న తనను తప్పించి వేరేవారిని నియమించడం ఎంతవరకు న్యాయమని ఫౌండర్ ట్రస్టీ వానపల్లి నర్సింగరావు ఆవేదన వ్యక్తం చేశారు. శాశ్వత ధర్మకర్తను చైర్మన్ స్థానం నుంచి ఎలా తప్పిస్తారని ప్రశ్నించారు. కూటమి కక్షపూరిత రాజకీయాలు ఇప్పుడు ఆలయాల ట్రస్టుబోర్డుల నియామకాల్లో కనిపించడం శోచనీయమన్నారు. స్థానిక విలేరులతో ఆయన గురువారం మాట్లాడుతూ.. తన తండ్రి వానపల్లి సూర్యనారాయణ (తమ్మయ్య గురువు) ఆలయాన్ని నిర్మించారని, అప్పటి నుంచి తామే వంశపారంపర్య ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నామని తెలిపారు.
దేవాలయాల ట్రస్టుబోర్డు సభ్యుల నియామకంలో రాజికీయాలను ప్రోత్సహించడం దేవదాయశాఖ అధికారులకు తగదన్నారు. ట్రస్టు బోర్డు మెంబరు ఉన్నచోట ఆయనే చైర్మన్‌గా వ్యవహరిస్తారని గతంలో దేవదాయశాఖ ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు స్పష్టంచేశారు. దేవదాయశాఖ ప్రస్తుతం ఇచ్చిన ఉత్తర్వులు సవరించకుంటే న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. ఈ విషయాన్ని ఆలయ ఈఓ పి.శ్యామలరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్‌గా వానపల్లి నర్సింగరావే ఉంటారని స్పష్టం చేశారు. దీనిపై గతంలో జీఓ కూడా ఇచ్చారన్నారు. ఆయన ఆధ్వర్యంలో బోర్డు మెంబర్లు ఉంటారని పేర్కొన్నారు.

వ్యవసాయశాఖ సైంటిస్టుల క్షేత్ర పర్యటన