
దొంగలపాలవుతున్న జగనన్న సర్వేరాళ్లు
సాలూరు రూరల్: గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో భూములు రీసర్వే చేసి హద్దులను నిర్ణయించే సర్వేరాళ్లు ప్రతి గ్రామంలోను అందుబాటులో ఉంచారు. అయితే రీసర్వే పేరుతో పూర్తిగా రైతుల భూములు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం లాక్కుంటుందని తప్పుడు ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు అదే సర్వేను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. గ్రామాల్లో రోడ్డు పక్కన నిరైతులకు అందుబాటులో నిల్వ ఉంచిన సర్వేరాళ్లు సాలూరు మండలంలో ఇటీవల చోరీకి గురవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు బుధవారం కొంతమంది దొంగచాటుగా ట్రాక్టర్‌లో సర్వేరాళ్లు తీసుకుని వెళ్తున్న విషయాన్ని గమనించి కొంతమంది ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడు ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.