
అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి పక్కా గృహం
● ఎస్‌ఎస్‌ఎల్‌ఆర్ ఎ.డి గోవిందరావు
పార్వతీపురం: జిల్లాలో అర్హత గల ప్రతి ఒక్క కుటుబానికి రానున్న రెండేళ్లలో పక్కా గృహం ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సర్వే, భూ నమోదు విభాగం అదనపు సంచాలకుడు ఆర్. గోవిందరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు భూమిని ఇంటి నిర్మాణానికి కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 2019 కన్నా ముందు అభ్యంతరాలు లేని ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి రెగ్యులైజేషన్‌ను ఈ ఏడాది డిసెంబర్ లోగా పూర్తి చేయాలన్నారు. ఆక్రమణకు గురైన శ్మశాన వాటికల స్థలాలను గుర్తించి, ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూమిని తిరిగి పొందేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని చెప్పారు. జిల్లాలో చేపడుతున్న రీ సర్వే–2 డిసెంబర్ 27 నాటికి పూర్తి కావాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జేసీ శోబిక రెవెన్యూ శాఖ ద్వారా చేపడుతున్న కార్యక్రమాల వివరాలు, లక్ష్యాలు, ప్రగతి నివేదికను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ, సి. యశ్వంత్ కుమార్ రెడ్డి, డీఆర్‌ఓ కె.హేమలత, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పి.ధర్మచంద్రారెడ్డి, ఎస్.దిలీప్ చక్రవర్తి, తదితరులు ఉన్నారు. జిల్లాకు వచ్చిన ఎస్‌ఎస్‌ఎల్‌ఆర్ ఏడీ గోవిందరావు తొలుత జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు.