
దళిత మహిళ నిర్బంధం అమానుషం
జియ్యమ్మవలస రూరల్: రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తే భయపడేది లేదు.. ఎంతమందిపై కేసులు పెడతారో మేమూ చూస్తాం.. సాక్షాత్తు ఎమ్మెల్యే అవినీతి బాగోతాన్ని, వర్కులపై తీసుకున్న కమీషన్లు, ఉద్యోగాల పేరిట వసూలు చేసిన దందాల వివరాలను బయటపెడతామని మాజీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి స్పష్టంచేశారు. చినమేరంగి క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తురకనాయుడువలస గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త, సోషల్ మీడియా ఐటీ విభాగం అధ్యక్షురాలు ఎత్తిలు మణిని మంగళవారం జియ్యమ్మవలస పోలీసులు 13 గంటల పాటు నిర్బంధంలోకి తీసుకోవడం తగదన్నారు. సోషల్ మీడియాలో ఓ పోస్టును కాపీ చేసి తన ఫేస్‌బుక్‌లో పెట్టినందున కూటమి పార్టీ నాయకుల మనోభావాలు దెబ్బతీశాయంటూ ఆమైపె కేసు పెట్టడాన్ని తప్పుబట్టారు. కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఒత్తిడితో కూటమి నాయకులు 20 మంది వరకు జియ్యమ్మవలస పోలీసు స్టేషన్‌కు వచ్చి పోలీసులపై ఒత్తిడి తీసుకురావడం, దళిత మహిళని చూడకుండా 13గంటల పాటు నిర్బంధంలోకి తీసుకోవడం దుర్మార్గమన్నారు. ఇలాంటి సంప్రదాయం కురుపాం నియోజకవర్గంలో మునుపెన్నడూ చూడలేదన్నారు. తాను ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, వారి భావస్వేచ్ఛకు ఏనాడూ అడ్డుపడలేదని, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇలాంటి ఆరోపణలు, అవమానాలు భరించాలన్నారు. నియోజకవర్గంలో గత ఐదేళ్లుగా వైఎస్సార్‌సీపీ చేసిన అభివృద్ధి కనిపించడం లేదంటే ఇంతకంటే అబద్ధం, అసత్యం ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి కార్యకర్తలకు ఇళ్లు, గోశాలలు, నీటి తొట్టెల కే పరిమితమైందన్నారు. గోశాలలు నిర్మించిన చాలా మందికి బిల్లులు రాక ఆవేదన చెందుతు న్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తించాలన్నారు. నియోజకవర్గంలో ప్రస్తుత, గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఈ సారి వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సూచన మేరకు రెడ్‌బుక్ రాజ్యాంగానికి బదులిస్తామని, దానికోసం మా దగ్గర బ్లూబుక్ ఉందని, అందులో ఎవరెవరి పేర్లు రాయాలో ఇప్పటికే రాశామన్నారు. కొంతమంది పోలీసులు అత్యుత్సాహం చూపి పోలీస్ వ్యవస్థ గౌరవాన్ని పోగొ ట్టుకోవద్దని అభ్యర్థించారు. కార్యక్రమంలో కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస మండలాల పార్టీ కన్వీనర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు.
రెడ్‌బుక్ రాజ్యాంగానికి స్వస్తి పలకాలి
లేదంటే పదింతలు బ్లూ బుక్ రాజ్యాంగం అమలు చేయాల్సి ఉంటుంది
మాజీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి హెచ్చరిక