
పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం
పార్వతీపురం: పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అభిప్రాయపడ్డారు. పారిశుద్ధ్య పక్షోత్సవాల్లో భాగంగా గరుగుబిల్లి మండలంలోని సుంకి, సంతోషపురం గ్రామాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను గురువారం తనిఖీ చేశారు. సుంకి గ్రామంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో వర్మీ కంపోస్టు ఎరువు తయారీని పరిశీలించారు.
అన్నిచోట్ల ఎరువు తయారీకి ప్రాధాన్యమివ్వాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై పల్లె ప్రజలకు అవగాహన కల్పించాలని, తడి, పొడిచెత్తనే వేర్వేరుగా సేకరించాలన్నారు. కాలువలు, వీధుల పరిశుభ్రతతోపాటు స్వచ్ఛమైన తాగునీటి సరఫరాపై దృష్టిసారించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు, ఎంపీడీఓ జి.పైడితల్లి, డిప్యూటీ ఎంపీడీఓ ఎల్.గోపాలరావు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికార ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి
తమ సమస్యలను పరిష్కరించాలని తోటపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామమైన సుంకి గ్రామ నిర్వాసితులు సర్పంచ్ కె.రవీంద్రతో కలిసి కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. నిర్వాసితులకు తక్షణమే పునరావసం కల్పించాలని కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తానన్నారు.
సుంకిలో వర్మీకంపోస్టు ఎరువు తయారీని
పరిశీలిస్తున్న కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్