
ఆటోలో 46కిలోల గంజాయి పట్టివేత
విజయనగరం క్రైమ్: విజయనగరంలో వన్‌టౌన్ పోలీసులు, క్రైమ్ పార్టీ నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద ఎల్‌ఐసీ బిల్డింగ్ దగ్గర 46 కేజీల గంజాయిని గురువారం పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఎస్పీ వకుల్ జిందల్ గురువారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం వన్ టౌన్ పోలీసులకు వచ్చిన కచ్చితమైన సమాచారంతో ఆటోలో ఒడిశా రాష్ట్రం నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి తరలించేదుకు తరలిస్తున్న 46కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. కాగా ఆటోలో పోలీసులు తనిఖీ చేయగా బ్యాగుల్లో 46 కేజీలు గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించి దాన్ని తరలిస్తున్న ఏడుగురు నిందితులైన చందక శ్రీను (28) చొంపి దివాకర్ (22) చొంపి కళ్యాణ్, (24) తంగుళ కిరణ్ కుమార్ (21), చొంపి సన్యాసిరావు (20) పిల్లా శివ (24) పిల్లా కమాలాకర్ (22) అనే ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.అలాగే ఆటో తో పాటు 46కిలోల గంజాయి, ఒక పల్సర్ బైక్, 5 సెల్‌ఫోన్లు, రూ.8 వేలు సీజ్ చేశారు. పట్టుబడిన నిందితులను విచారణ చేయగా పెదబయలుకు చెందిన చందక శ్రీను గంజాయిని ఆటోలో విజయనగరం తీసుకువచ్చి ఇక్కడి నుంచి కాకినాడకు చెందిన మరో ఇద్దరి ద్వారా హైదరాబాద్ కు తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని ఎస్పీ వకుల్ జిందల్ చెప్పారు. పరారైన ప్రధాన నిందితుడు అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలుకు చెందిన రాంబాబును అరెస్టు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, వన్ టౌన్ సీఐ ఆర్.వి.ఆర్.కె చౌదరి, ఎస్‌ఐలు బి.సురేంద్ర నాయుడు, డి.రామ్ గణేష్ ఇతర పోలీసు సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందల్ అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఏడుగురు నిందితుల అరెస్ట్
ఒడిశా నుంచి ఢిల్లీకి తరలింపు