
భవానీకి కలెక్టర్ అభినందనలు
విజయనగరం: ఇటీవల కజకిస్థాన్‌లో జరిగిన జూనియర్ ఆసియన్ చాంపియన్ షిప్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో వరుసగా 3 బంగారు పతకాలను సాధించి, జిల్లా కీర్తి పతాకాన్ని ఎగురవేసిన కొండకరకాం గ్రామానికి చెందిన క్రీడాకారిణి రెడ్డి భవానీని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అభినందించారు. ఈ మేరకు గురువారం తన క్యాంపు కార్యాలయంలో దుశ్శాలువ, జ్ఞాపికతో భవానీని సత్కరించారు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ తరఫున రూ.25వేల నగదు ప్రోత్సాహకాన్ని చెక్కు రూపంలో అందజేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలంటూ ప్రోత్సహించారు. రెడ్డి భవాని నేపథ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని కలెక్టర్ తెలుసుకుని అప్పటికప్పుడు తహసీల్దార్ కూర్మనాథరావును రప్పించి వెంటనే ఆమెకు ఇంటి పట్టా ఇవ్వాలని ఆదేశించారు. అలాగే హౌసింగ్ పీడీ మురళీమోహన్‌ను పిలిచి ఇల్లు మంజూరు చేయడమే కాకుండా, నిర్మాణ బాధ్యతను కూడా చూడాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులతో పాటు, జిల్లా క్రీడాధికారి వెంకటేశ్వరరావు, కోచ్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
వెయిట్‌లిఫ్టర్ భవానీకి హెల్పింగ్ హ్యాండ్స్ హిజ్రాస్ సత్కారం
కొండకరకాం క్రీడాకారిణి రెడ్డి భవాని భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహం అందించాలని జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ కోరారు. ఈ మేరకు గురువారం హెల్పింగ్ హ్యాండ్స్ హిజ్రాస్ అసోసియేషన్ అధ్యక్షుడు దవడ కొండబాబు, దవడ మీనా అధ్యక్షతన భవానీకి జరిగిన సత్కార సభకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితిగజపతిరాజు, ఎంపీ కలిశెట్టి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఆమె పరిస్థితిని తీసుకువెళ్లాలని భీశెట్టి కోరారు, సత్కార సభలో కొత్తా సునీల్, ముంతాజమ్మ, స్రవంతి, కొండబాబు,స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రాజు, నాగభూషణం, రమేష్, రాంమోహన్, శ్రీను, రామచంద్ర రాజు తదితరులు భవానీకి ఆర్థిక సహాయం చేశారు.
తక్షణమే ఇల్లు మంజూరుకు ఆదేశాలు

భవానీకి కలెక్టర్ అభినందనలు