
3
బస్తా యూరియా కోసం..
గంటలు క్యూలో..
వీరఘట్టం:
జిల్లాలో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టుల నుంచి సాగునీరు విడుదల చేయడంతో అక్కడక్కడ వరి ఉభాలు సాగుతున్నాయి. మరోవైపు మెట్టభూముల్లో పత్తి, మొక్క జొన్న, వివిధ రకాల కూరగాయల పంటలు మొక్కదశలో ఉన్నాయి. వీటికి ఎరువు వేసే సమయం ఆసన్నమైంది. ప్రసుత్త ప్రభుత్వం రైతులకు అవసరమైన యూరియా సరఫరాలో విఫలమైంది. జిల్లాలో యూరియా కొరత వెంటాడుతోంది. రైతు సేవాకేంద్రాలకు వచ్చిన అరకొర యూరియా కోసం రైతులు పనులు మానుకుని పరుగులు తీయాల్సిన పరిస్థితి. వీరఘట్టం మేజర్ పంచాయతీలో గురువారం రైతుకు ఒక యూరియా బస్తా అందజేశారు. వాటి కోసం 3 గంటల పాటు నిరీక్షించారు. కూటమి ప్రభుత్వం రైతన్నకు సాగుసాయం అందజేయడంలోనే కాదు ఎరువు కొరత తీర్చడంలోనూ విఫలమైందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. గత ప్రభుత్వం ఆర్‌బీకేల ద్వారా రైతులకు కావాల్సిన ఎరువులు సరఫరా చేస్తే... ప్రస్తుత ప్రభుత్వం విత్తనాలు, ఎరువులను అందజేయకుండా రైతన్నను ఇబ్బందులకు గురిచేస్తోందంటూ ఆవేదన వ్యక్తంచేశారు. గత ఐదేళ్లులో ఖరీఫ్‌లో ఏనాడూ ఎరువు, విత్తనాల కోసం ఎక్కడా క్యూకట్టలేదని, కూటమి ప్రభుత్వంలో మళ్లీ రైతన్నకు కష్టాలు మొదలయ్యాయంటూ నిట్టూర్చారు.
400 బస్తాల పంపిణీ..
వీరఘట్టం మేజరు పంచాయతీలోని ఆర్‌ఎస్‌కేకు 440 బస్తాల యూరియా వచ్చింది. వీటిని ఉదయం పంపిణీ చేస్తారన్న సమాచారంతో రైతులు పెద్ద ఎత్తున మార్కెట్‌యార్డులో ఉన్న ఆర్‌ఎస్‌కే వద్ద బారులు తీరారు. రైతులు ఎక్కువ మంది క్యూలో నిల్చోవడం, యూరియా తక్కువ కావడంతో ఒక రైతుకు ఒక బస్తా చొప్పున మండల వ్యవసాయశాఖ అధికారి జె.సౌజన్య ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. యూరియా పంపిణీ సజావుగా సాగేందుకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఏఎస్‌ఐ కృష్ణమనాయుడు, కానిస్టేబుల్ వచ్చి బందోబస్తు విధులు నిర్వహించారు. రైతులకు అవసరమైన యూరియాను తెప్పిస్తామని, ఆందోళన చెందవద్దని ఏఓ తెలిపారు.
ఈ చిత్రం చూశారా... వీరంతా యూరియా కోసం వీరఘట్టం మేజర్ పంచాయతీలోని రైతుసేవా కేంద్రం వద్ద గురువారం ఉదయం 8 నుంచి క్యూ కట్టిన రైతులు. ఒక యూరియా బస్తా కోసం 3 గంటల పాటు నిరీక్షించారు. ఖరీఫ్ సీజన్‌లో పంటలకు వేసేందుకు యూరియా అవసరం కావడం, ప్రభుత్వం అవసరం మేర సరఫరా చేయకపోవడంతో.. మగ, ఆడ తేడా లేకుండా రైతులందరూ పనులు మానుకుని యూరియా కోసం పరుగులు తీశారు. ఎరువు కొరతకు ఈ చిత్రమే సజీవసాక్ష్యం.
రైతన్నకు తప్పని ఎరువు కష్టాలు
పనులు మానుకొని ఎరువుకోసం నిరీక్షణ
కూటమి ప్రభుత్వం తీరుపై ఆగ్రహం

3