
వైఎస్సార్‌సీపీలో నియామకాలు
పాలకొండ రూరల్/గుమ్మలక్ష్మీపురం: వైఎస్సార్‌సీపీ పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గ ఎంప్లాయీస్, పెన్షనర్ల విభాగ అధ్యక్షుడిగా దుప్పాడ పాపినాయుడు నియమితులయ్యారు. వైఎస్సార్‌టీయూసీ విభాగ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా కురుపాం నియోజకవర్గానికి చెందిన వడ్డి మహేశ్వరరావును నియమించారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నియామకాలు చేపట్టినట్లు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.
శంబర పోలమాంబ ఆలయ ఈఓగా శ్రీనివాసరావు
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి ఆలయ ఈఓగా బి.శ్రీనివాసరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. చీపురుపల్లి కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ ఈఓగా పనిచేస్తూ ఉద్యోగోన్నతిపై శంబర పోలమాంబ అమ్మవారి ఆలయ గ్రేడ్–1 ఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఇంతవరకు పోలమాంబ అమ్మవారి ఆలయ ఈఓగా పనిచేసిన వి.వి.సూర్యనారాయణ పాలకొండ కోటదుర్గ అమ్మవారి ఆలయం, తోటపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం, పార్వతీపురంలోని గ్రూపు దేవాలయాల అధికారిగా బదిలీ అయ్యారు.
ఏజెన్సీలో సీఆర్‌పీఎఫ్ బలగాల కూంబింగ్
మక్కువ: ఏజెన్సీ గ్రామాల్లో సీఆర్‌పీఎఫ్ 198 బెటాలియాన్ అసిస్టెంట్ కమాండెంట్ రాజ్‌కుమార్ నేతృత్వంలో గురువారం సీఆర్‌పీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. మార్కొండపుట్టి, బొడ్డు సామంతవలస, ఎర్ర సామంతవలస, పనసబద్ర, దుగ్గేరు, మూలవలస తదితర గ్రామాల్లో అనుమానిత ప్రదేశాలను నిశితంగా పరిశీలించాయి. కల్వర్టుల వద్ద మెటల్‌డిటెక్టర్‌తో తనిఖీలు జరిపాయి. మక్కువ మండలం ఆంధ్రా–ఒడిశా బోర్డర్‌లో ఉండడంతో మావోయిస్టు కదలికలపై ఆరా తీశాయి.
పోలవరం ఎత్తు తగ్గితే
ఉత్తరాంధ్రలో కరువు ఖాయం
బొబ్బిలి రూరల్: పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గితే ఉత్తరాంధ్రలో కరువు ఖాయమని, కూటమి ప్రభుత్వం ప్రాజెక్టు ఎత్తుతగ్గించేలా చేపట్టే నిర్మాణాలవల్ల తీరని నష్టం కలుగుతుందని ఉత్తరాంధ్ర సాధన సమితి కన్వీనర్ వేమిరెడ్డి లక్ష్మునాయుడు అన్నారు. తన కార్యాలయంలో స్థానిక విలేకరులతో గురువారం మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో ముందు చూపుతో పోలవరం నుంచి సుజలస్రవంతి ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలకు సాగు, తాగునీరిందేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని, నేటి ప్రభుత్వం ఉత్తరాంధ్రకు అన్యాయం చేసేందుకు యత్నిస్తోందని ఆయన విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తు వరకు నీటిని నింపి ఉత్తరాంధ్ర ప్రజల అవసరాలను తీర్చేలా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్మాణాత్మకంగా చర్యలు చేపట్టిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కేంద్రం ఒత్తిడికి తలొగ్గి 41.15 మీటర్లకు కుదించేలా ఒప్పందం చేసుకుందని, దీనివల్ల ఉత్తరాంధ్ర ప్రజల తాగు, సాగునీటి అవసరాలు పోలవరం ప్రాజెక్టుతో నెరవేరవన్నారు. కూటమి తీరును ఉత్తరాంధ్ర ప్రజలు క్షమించరన్న విషయాన్ని గుర్తించాలన్నారు. సమావేశంలో సమితి సభ్యులు ఆర్.శంకరరావు, కృష్ణ పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీలో నియామకాలు