
కక్షసాధింపు చర్యలు మంత్రికి తగవు
● సంధ్యారాణికి ఉద్యోగాలు తొలగించే మూడోశాఖ ఇవ్వండి ● మీడియా సాక్షిగా చంద్రబాబు, లోకేశ్‌కు సూచించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర
సాలూరు రూరల్: వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులుగా ముద్రవేసి ఉన్నతాధికారులపై ఒత్తిడితెచ్చి మరీ దళిత, గిరిజన ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్న మంత్రి సంధ్యారాణి తీరు మంచిదికాదని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. సంధ్యారాణికి ఉద్యోగాలు తొలగించే మూడో శాఖ ఇవ్వాలంటూ మీడియా సాక్షిగా చంద్రబాబు, లోకేశ్‌కు సూచించారు. సాలూరులోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులు పొరపాటు చేస్తే మందలించాలే తప్ప వారి పొట్టపై కొట్టకూడదన్నారు. అవినీతి ఆరోపణలు ఉంటే తొలగించడంలో తప్పులేదన్నారు. కేజీబీవీలో వంటపనివారు తప్పుచేస్తే ప్రత్యేక అధికారి అయిన ప్రశాంతిని సస్పెండ్ చేయడం అడ్డగోలు చర్యలేనన్నారు. ఆమె పీటీజీ గదబ కులానికి చెందిన మహిళ. ఆమె కడుపు కొట్టడానికి మీకు మనసు ఎలావచ్చిందని మంత్రిని ప్రశ్నించారు. ఆమె కుంటుంబం వెంకళరాయి సాగర్‌లో చేపలు పట్టుకొని జీవనం సాగిస్తుంటారు. ఒక్కసారి వారి ఇంటికి వెళ్లి చూడండి. పీటీజీ మహిళ అయిన మన రాష్ట్రపతి ద్రౌపదిముర్మును గౌరవంగా చూస్తున్న మనం ఇక్కడ అదే సామాజిక వర్గానికి చెందిన మహిళపై ఇంత అన్యాయంగా వ్యవహరిస్తారా? అంటూ మంత్రి చర్యలను దుయ్యబట్టారు. ఉపాధిహామీ పథకంలో రూ.23 లక్షలు అక్రమాలు జరిగాయన్న అంశంపై చిరుద్యోగులపై కాకుండా ఉపాధిహామీ పీడీపై ఎందుకు కలెక్టర్ చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అధికారుల తీరు మారకుంటే చిరుద్యోగుల తరఫున న్యాయపోరాటం చేస్తామన్నారు. గిరిజన, శిశు సంక్షేమ శాఖల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పీడీలను ఎందుకు సస్సెండ్ చేయడంలేదన్నారు. ఉద్యోగులపై చర్యలు తీసుకోమనడం తన అభిమతం కాదన్నారు. పొరపాట్లు చేస్తే వారిని మందలించాలే తప్ప ఉద్యోగాల నుంచి తొలగించి వారి కడుపుకొట్టడం మంచిది కాదన్నారు. ఐసీడీఎస్‌లో డబ్బులే మాట్లాడతాయి అంటూ పత్రికల్లో వచ్చిన వార్తలపై మంత్రి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు.
ఏ రోజూ ఉద్యోగులను బాధించలేదు..
తను నాగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రి గా పనిచేసినా ఏ రోజు కూడా ఏ ఒక్క ఉద్యోగిని బాధించలేదని రాజన్నదొర తన పాలనాతీరును వెల్లడించారు. ఒకవేళ పొరపాటున నోరు జారితే క్షమించమని అడుగుతానే తప్ప ఉద్యోగుల పొట్టకొట్టే ప్రయంత్నం తాను ఎన్న డూ చేయలేదన్నారు. మంత్రి సంధ్యారాణి నడిమంత్రపు సిరితో గెలిచి గెంతులు వేస్తున్నా రని, ఇలాగే కొనసాగితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ వంగపండు అప్పలనాయుడు, గొర్లె జగన్ మోహనరావు, కౌన్సిలర్ సింగారపు ఈశ్వరరావు, గిరి రఘు పాల్గొన్నారు.