
గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు
డెంకాడ: మండలంలోని విశాఖ–శ్రీకాకుళం జాతీయ రహదారిపై నాతవలస వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న మోటార్ సైకిల్ ముందుగా వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. దీంతో మోటార్ సైకిల్‌పై వెళ్తున్న కుప్పిలి కృష్ణ, సవర ముఖలింగం తీవ్రంగా గాయపడి, అపస్మారక స్థితిలో ఉన్నారని ఎస్సై ఎ.సన్యాసినాయుడు తెలిపారు. విజయనగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. గాయపడిన ఇద్దరు వ్యక్తులు అపస్మారక స్థితిలో ఉండడం వల్ల పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై తెలిపారు.
స్కూటీ ఢీకొట్టి విద్యార్థినికి..
వీరఘట్టం: స్థానిక బాలికోన్నత పాఠశాలలో గురువారం జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ డేకు వెళ్తున్న 8వ తరగతి విద్యార్థిని కరజాడ లక్ష్మికి రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి.హైస్కూల్ ఎదురుగా ఉన్న పాన్ షాపు వద్దకు చాకెట్లు కొనుగోలు చేసేందుకు రోడ్డు దాటి వెళ్తున్న విద్యార్థిని లక్ష్మిని ఎదురుగా స్కూటీతో వచ్చిన ఓ వ్యక్తి ఢీ కొట్టాడు. దీంతో జరిగిన ఈ ప్రమాదంలో లక్ష్మి కుడి కాలు విరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. గాయపడిన లక్ష్మిని 108 వాహనంలో పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే తహసీల్దార్ ఏఎస్ కామేశ్వరరావు బాలికోన్నత పాఠశాలకు వెళ్లి గాయపడిన బాలిక, తల్లిదండ్రుల వివరాలను హెచ్‌ఎం కేపీ నాగమణిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు.

గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు