
ఉద్యోగుల సమస్యలను విస్మరించిన కూటమి
● ఏపీఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్
పార్వతీపురం:
ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమం, సమస్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఐక్య పోరాటాలకు సిద్ధంకావాలని ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ పిలుపునిచ్చారు. ఉద్యోగులు, పింఛన్‌దారుల సమస్యల పరిష్కారాని కి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. పార్వతీ పురం మన్యం జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా అధ్యక్షుడు జీవీ కిషోర్ అధ్యక్షతన శుక్రవారం ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. వేతన సవరణ కమిషన్‌ను నియమించకపోవడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపడమేనన్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.27,500 కోట్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ విధులను సక్రమంగా నిర్వహిస్తున్న ఉద్యోగులకు వేతన సవరణ కమిషన్‌ను నియమించి మెరుగైన మధ్యంతర భృతిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల భవిష్యనిధి, ప్రభుత్వ బీమా వంటి పథకాల్లో దాచుకున్న నిధులను ఉద్యోగులకు చెల్లించకపోవడం పట్ల తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రివర్స్ పీఆర్‌సీని అమలు చేయడం విచారకమన్నారు.
సంఘంలో ఉన్న ఉద్యోగుల తరఫున నిరంతర పోరాటం చేస్తామన్నారు. ఏన్‌జీఓ సంఘంలో ఉన్న సభ్యులలో కనీసం 30శాతం మంది నాయకత్వ బాధ్యతలను కలిగి ఉండాలన్నారు. భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో ఏపీ ఎన్‌జీఓల ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాల్సి ఉందని అభిప్రాయ పడ్డారు. కార్యక్రమంలో ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జీవీ రమణ, ఉత్తరాంధ్ర జిల్లాల ఏపీ ఎన్‌జీఓల నాయుకులు, పింఛన్‌దారుల సంఘం నాయకులు, ఉపాధ్యాయ సంఘనాయుకులు బాలకృష్ణ, ఎస్.మురళి, జి.జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.