
శివారు భూములకూ సాగునీరు
పార్వతీపురం: సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టు ద్వారా శివారు భూములకు సాగునీరు సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ వద్ద సాగు నీటిని కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి సమక్షంలో ఆమె నీటిని ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కాలువ వద్ద శాస్త్రాక్తంగా పూజలను నిర్వహించి నదికి హారతులిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ ప్రాజెక్టు కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. జంఝావతి, కోటియా సమస్యలపై ఒడిశా ముఖ్యమంత్రితో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పూర్ణపాడు–లాభేసు వంతెన నిర్మాణం పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. పార్వతీపురం సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీవో అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ప్రాజెక్టుకు సంబంధించి భూ సమస్య పరిష్కారమైందన్నారు. రిజర్వాయర్ పరిసరాల్లో పర్యాటక అభివృద్ధికి చాలా అనుకూలంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఉత్తర కోస్తా జల వనరుల శాఖ ఎస్‌ఈ కేవీఎన్ స్వర్ణకుమార్, ఈఈ హెచ్.మన్మధరావు, డీఈఈ బి.గోవిందరావు, టి.రఘునందన్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రి సంధ్యారాణి