
ప్రాణం తీసిన స్నేహితుడి మోసం
సాలూరు:
స్నేహం ముసుగులో మోసానికి సాలూరు పట్టణానికి చెందిన ఓ చిరువ్యాపారి బలయ్యా డు. ఆర్థిక వేధింపులకు తట్టుకోలేక బుధవారం ఉదయం 4.30 సమయంలో తన ఎలక్ట్రిక్ షాపులోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. స్నేహితుడే తనను నట్టేట ముంచేశా డంటూ ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన ఆడియోను మిత్రులకు పంపించాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, కుటుంబ సభ్యులు, మృతిడి ఆడియో రికార్డులో తెలిపిన వివరాల ప్రకారం.. పాచిపెంట మండలం గురివినాయుడుపేట గ్రామానికి చెందిన నాగభూషణరావు(63) సుమారు 32 సంవత్సరాల కిందట సాలూరు పట్టణానికి వలస వచ్చాడు. ఇక్కడి తెలగావీధిలో కుటుంబంతో నివసిస్తూ మామిడిపల్లి కూడలిలో ఎక్ట్రిక్ షాపు నిర్వహిస్తున్నాడు. వ్యాపార అవసరాల్లో భాగంగా పట్టణంలోని డబ్బివీధికి చెందిన వడ్డీ వ్యాపారి డబ్బి కృష్ణారావు వద్ద రూ.40 లక్షలు అప్పుచేశాడు. ఆ డబ్బు ఎప్పటికీ తిరిగి ఇవ్వడం లేదని రూ.కోటి విలువైన షాపును రూ.75 లక్షలకే కృష్ణారావు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. నాగభూషణరావు తీసుకున్న రూ.40 లక్షలు అప్పు మినహాయిస్తే మిగిలిన రూ.35 లక్షలు ఇవ్వలేదు. రూ.10 లక్షలు అప్పుగా తిరిగిచ్చాడు. నాగభూషణరావు నుంచి బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న షాపును తిరిగి ఆయనకే నెలకు రూ. 20వేలు అద్దె ప్రాతిపదికన తనఖా ఇచ్చాడు. పది లక్షలకు వడ్డీ రూ.పదివేలు చొప్పున నెలకు ప్రతినెలా రూ.30 వేలు వడ్డీ వ్యాపారి వసూలు చేస్తున్నాడు. తన డబ్బునే ఉంచుకుని, తనకు అప్పుకింద ఇచ్చి వడ్డీ వసూలు చేస్తూ కృష్ణారావు తనను ఆర్థిక కష్టాల్లోకి నెట్టేశాడని, ఎదిరించే ధైర్యంలేక, మోసాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆడియోలో పేర్కొన్నారు. మృతునికి భార్య పద్మావతి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నా రు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సాలూరు టౌన్ ఎస్‌ఐ అనిల్‌కుమార్ కేసు నమోదు చేశా రు. ఆత్మహత్యకు పాల్పడిన నాగభూషణరావు జేబులో రాతపూర్వక లేఖ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు ఆలేఖను స్వాధీనం చేసుకున్నారు.
కుటుంబాన్ని ఆదుకోవాలని
మంత్రికి విజ్ఞప్తి
చనిపోయేముందుకు తన బాధను మంత్రి సంధ్యారాణికి తెలిసేలా అడియోరూపంలో రికార్డు చేసి మిత్రలకు పంపించాడు. తనకు జరిగిన మోసం, అన్యాయాలను మంత్రికి తెలపాలనుకున్నా బిజీగా ఉంటారని, స్నేహితుడిపై ఏం చెప్తానని వెనుకకు తగ్గాను. నా కష్టాలు చూసి వాడి మనసు మారుతుందని ఆశించాను. స్నేహితుడైన కృష్ణారావు చేసిన అన్యాయాన్ని, మోసాన్ని భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ నాగభూషణరావు ఆడియోలో పేర్కొన్నారు. తనకు కృష్ణారావు ఇవ్వాల్సిన రూ.15 లక్షలు, తను నెలానెలా చెల్లించిన రూ.12 లక్షలు మొత్తం రూ.27 లక్షలు తన కుటుంబానికి ఇప్పించాలని మంత్రికి విజ్ఞప్తిచేశాడు. టీడీపీ మాజీ కౌన్సిలర్ కృష్ణారావు కొంతకాలంలో వడ్డీవ్యాపారం చేస్తున్నాడు. మంత్రి సంధ్యారాణికి సన్నిహితుడు. వ్యాపారి మృతితో వడ్డీవ్యాపారుల ఆరాచకాలపై పట్టణంలో చర్చజోరందుకుంది.
రాజీయత్నాలు
చిరువ్యాపారి మృతిచెందుతూ ఆడియో రూపంలో తెలిపిన ఆవేదన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. మాజీ కౌన్సిలర్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో టీడీపీ నాయకులు నిందితుడిని కాపాడేందుకు రంగంలో దిగారు. మృతుడు నాగభూషణరావు కుటుంబ సభ్యులతో మంతనాలు జరిపారు. కొంత మొత్తానికి రాజీ కుదిర్చినట్టు సమాచారం. ఈ సంఘటనపై మృతుడు భార్య పద్మావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్‌ఐ అనిల్‌కుమార్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మంత్రి అనుచరుడైన వడ్డీవ్యాపారి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన చిరువ్యాపారి
తన ఆవేదనను ముందుగా రికార్డుచేసి మిత్రులకు పంపించిన మృతుడు
కుటుంబాన్ని మంత్రి సంధ్యారాణి ఆదుకోవాలంటూ వేడుకోలు
కన్నీటిపర్యంతమైన కుటుంబ సభ్యులు

ప్రాణం తీసిన స్నేహితుడి మోసం