
తల్లికి ఏం కష్టమన్నా!
వందనమన్న చంద్రన్నా..
● ‘తల్లికి వందనం’ పథకంలో లోపాలు
● అర్హులకు కలగని లబ్ధి
● అధికారుల చుట్టూ ప్రదక్షిణలు
సాక్షి, పార్వతీపురం మన్యం :
తల్లికి వందనం పథకం కింద అందరికీ లబ్ధి కలిగిస్తామన్న కూటమి ప్రభుత్వం మాటలు కోటలైతే దాటాయి గానీ.. వేలాది మంది లబ్ధిదారుల గుమ్మానికి మాత్రం నగదు చేరలేదు. చిరుద్యోగులనూ ప్రభుత్వ ఉద్యోగుల కిందే భావించి.. వేలాది మందిని లబ్ధికి ప్రభుత్వం దూరం చేసింది. మరోవైపు విద్యుత్తు వినియోగం, నమోదులో తప్పులు, ఇతరత్రా కారణాలతో మరికొంతమంది పథకానికి నోచుకోలేకపోయారు. తప్పులను సరిదిద్ది తమకు న్యాయం చేయాలని, పిల్లలకు పథకం వర్తింపజేయాలని నేటికీ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ముఖ్యంగా పిల్లల తల్లులు పనులు మానుకొని మరీ కార్యాలయాల వద్దకు పరుగులు పెడుతున్నారు. వారి సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల కింద 1,594 విద్యాలయాలు ఉన్నాయి. మొదటి విడతగా 1,08,951 మంది విద్యార్థులు తల్లికి వందనం పథకానికి అర్హత సాధించారు. 69,600 మంది తల్లుల ఖాతాలకు నగదు జమ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దాదాపు రూ.141 కోట్ల మేర నిధులు విడుదల చేశారు. రూ.15 వేల్లో రూ.2 వేలు పాఠశాల నిర్వహణ, అభివృద్ధి కోసమంటూ కోత విధించారు. ఒకటి, ఇంటర్ ప్రవేశాలు.. అనర్హత పేరుతో జాబితాలో పేరు లేకపోయిన వారి అర్జీలను స్వీకరించారు. వీరందరికీ జులై 5న మరలా నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. ఇంకా వేలాది మంది రోజూ పథకం వర్తింపు కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పథకం అందేదని.. ఇప్పుడే ఎందుకు అనర్హులుమయ్యామని పలువురు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. తిరిగి తిరిగి కాళ్లు అరుగుతున్నాయే గానీ.. అధికారులు తమ మొర వినడం లేదని, ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వాపోతున్నారు.
పేదింటికి అందని పథకం
ఈ చిత్రంలోని మహిళ పేరు ఎం.సాయి. సాలూరు పట్టణంలోని చినహరిజనపేటకు చెందిన వ్యవసాయ కూలీ కుటుంబం. ఈమెకు పాఠశాల విద్య చదువుతున్న ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఉండటానికి చిన్న ఇల్లు తప్ప.. ఇంకేం ఆస్తిపాస్తులూ లేవు. విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉందని చూపిస్తూ.. తల్లికి వందనం పథకాన్ని ఈ కుటుంబానికి దూరం చేశారు. ఇంట్లో ఫ్యాను, లైటు తప్ప ఇంకేమీ లేవని ఆమె వాపోతోంది.