
బురదలో కలిసిన రైతు ప్రాణం
వేపాడ: ఆయనకు వ్యవసాయమంటే మక్కువ. ఊహ తెలిసిన నుంచి పంటల సాగులో నిమగ్నమవుతున్నారు. సొంత ట్రాక్టర్‌ను కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఆయనపై విధి కన్నెర్ర చేసింది. ట్రాక్టర్ రూపంలో మృత్యువుకాటేసింది. దమ్ముమడిలోనే ప్రాణాలను తీసేసి కుటుంబ సభ్యుల్లో విషాదాన్ని నింపింది. ఈ విషాదకర ఘటన వేపాడ మండలం కొండగంగుబూడి పంచాయతీ ఎస్.కోట సీతారాంపురంలో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్.కోట సీతారాంపురం గ్రామానికి చెందిన పరవాడ రామేశ్వరరావు(45)కు వ్యవసాయమే జీవనాధారం. తన పొలాన్ని ట్రాక్టర్‌తో తనే దమ్ముచేస్తుండగా అదుపుతప్పి ట్రాక్టర్ బొల్తాకొట్టింది. అంతే... ఆయన ట్రాక్టర్ కింద ఉండిపోయారు. రక్షించేందుకు అక్కడి రైతులు పరుగుతీసినా ప్రయోజనం లేకపోయింది. దమ్ముమడిలోనే ఆయన ప్రాణాలు విడిచారు. జేసీబీ సాయంతో ట్రాక్టర్‌ను పక్కకుతీసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషాదకర ఘటనతో గ్రామం ఘొల్లుమంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతునికి భార్య వెంకటలక్ష్మి, తల్లి అచ్చియ్యమ్మ, కుమార్తెలు లీలావతి, హైమావతి ఉన్నారు. చిన్నకుమార్తె హైమావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వల్లంపూడి ఎస్‌ఐ ఎస్.సుదర్శన్ కేసు నమోదుచేశారు.
దమ్ముమడిలో ట్రాక్టర్ బోల్తా
అక్కడిక్కడే మృతిచెందిన రైతు
విలపిస్తున్న కుటుంబ సభ్యులు

బురదలో కలిసిన రైతు ప్రాణం