సాలూరు రూరల్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేయకుండా చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాన్ని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు పీడిక రాజన్నదొర సాలూరు పట్టణం 23వ వార్డు రామాకాలనీ ప్రజలకు బుధవారం వివరించారు. కాలనీలో ఇంటింటికీ వెళ్లి సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు అమలుచేయకపోవడం వల్ల ఏడాదిలో ఒక్కో కుటుంబం ఎంత నష్టపోయారన్నది తెలియజేశారు. దీనిపై కూటమి నేతలను నిలదీయాలని సూచించారు. గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ శతశాతం అమలుచేసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అంటూ ప్రజలకు మోసం ఫిక్స్ చేసిన తీరును వివరించారు. గత ప్రభుత్వం కంటే రెట్టింపు పథకాలు ఇస్తామంటే నమ్మిఓట్లు వేసి మోసపోయామని, ఉచిత బస్సు, గ్యాస్‌సిలిండర్లు, నిరుద్యోగ భృతి, రైతుభరోసా ఇలా.. ఏ పథకమూ అందడంలేదంటూ పలువురు మహిళలు రాజన్నదొర వద్ద వాపోయారు. దీనిపై రాజన్నదొర స్పందిస్తూ అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట అని, ఆయన మాటల గారడీతో ఎవరినైనా మోసంచేస్తారంటూ విమర్శించారు. సంపద సృష్టిస్తానని చెప్పి విద్యుత్ చార్జీలు, ఇంటిపన్నుల భారం వేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ, వైస్ చైర్మన్ వంగపండు అప్పలనాయుడు, కౌన్సిలర్లు గొర్లె జగన్‌మోహన్, గిరి రఘ, మాజీ కౌన్సిలర్ పిరిడి రామకృష్ణ, వైఎస్సార్ సీపీ నాయకులు తాడ్డి రమణ, కర్రి మహేష్, జాగారపు రమేష్, రామాకాలనీ నాయకులు పాల్గొన్నారు.