
ఇంత పెద్ద చేపా..!
సంతకవిటి: మండలంలోని నారాయణపురం ఆనకట్టలో 15 కేజీల బరువుండే భారీ చేప దొరికింది. తోటపల్లి జలాశయం నుంచి నీటిని దిగువకు విడిచి పెట్టడంతో పాటు వర్షాలు కురుస్తుండండంతో ఆనకట్టలోకి వరద నీరు పోటెత్తింది. దీంతో ఆనకట్టలో మత్స్యకారులు చేపల వేట కొనసాగిస్తున్నారు. శనివారం రాత్రి ఓ మత్స్యకారుడికి భారీ చేప దొరికింది. దీన్ని చూసేందుకు రంగారాయ పురం గ్రామస్తులు పరుగులు తీశారు.
చిన్నబగ్గ–గోరపాడు మధ్య ఏనుగులు
సీతంపేట: మండలంలోని చిన్నబగ్గ–గోరపాడు కొండల మధ్య ఏనుగులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ సిబ్బంది తెలిపారు. గడిచిన రెండు రోజులుగా గోరపాడు జీడితోటల్లో ఉన్న ఏనుగులు ఆదివారం ఉదయం చిన్నబగ్గ తోటల్లో సంచరిస్తూ కొండశిఖరానికి వెళ్లినట్టు ట్రాకర్లు గుర్తించారు. జీడి, మామిడితోటల కొమ్మలు, అక్కడక్కడ అరటి పంటను నాశనం చేస్తున్నాయని స్థానికులు తెలిపారు. ఎఫ్‌బీవో కె.దాలినాయుడుతో పాటు ట్రాకర్లు ఏనుగుల గమనాన్ని గుర్తించి తగు సూచనలిస్తున్నారు.
వీణ కచేరీతో బాలమురళికి నీరాజనం
విజయనగరం టౌన్: ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం విజయనగరంలోని ఆర్యసోమయాజుల కాశీపతిరావు స్మారక భవనంలో పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ 95వ జయంతి ఉత్సవంలో విశాఖకు చెందిన డాక్టర్ నిష్టల కృష్ణవేణి చేసిన వీణకచేరీ ఆహూతులను ఆకట్టుకుంది. ప్రముఖ మృదంగ విద్వాంసుడు, సంస్థ కార్యదర్శి డాక్టర్ మండపాక రవి మృదంగంపై సహకారం అందించి కచేరీని రక్తి కట్టించారు. అసోసియేషన్ అధ్యక్ష్యుడు ధవళ సర్వేశ్వరరావు, సభ్యులు బాలమురళి చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించి, వారి జీవిత విశేషాలను వివరించారు. కార్యక్రమంలో దూసి శివరాం శర్మ, టి.మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
భగవతి చిన్నారులకు నంది, నాట్యమయూరి అవార్డులు
విజయనగరం టౌన్: విజయనగరంలోని భగవతి నృత్యకళామందిర్ చిన్నారులు నాట్య మయూరి అవార్డులు అందుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆదివారం నృత్యాలయ నాట్యకళా వెల్పేర్ అసోసియేషన్, సిరి ఆర్ట్స్ అకాడమీల ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణా బోనాల సంబరాలు, గురుపూజోత్సవంలో అద్భుతమైన ప్రదర్శన చేసి ఆహూతుల మన్ననలు పొందారు. ఈ సందర్భంగా నంది, నాట్యమయూరి అవార్డులను కై వసం చేసుకున్నట్లు అకాడమీ డైరెక్టర్ వడ్లమాని రమణకుమారి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలువురు అభిమానులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

ఇంత పెద్ద చేపా..!

ఇంత పెద్ద చేపా..!

ఇంత పెద్ద చేపా..!