
దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలి
విజయనగరం గంటస్తంభం: డ్రైవర్ల మెడకు ఉరితాడు బిగించి, రవాణా రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టపెట్టే మోటార్ వాహన చట్టం 2021,భారత న్యాయ సంహిత చట్టం 106(1,2)లను రద్దు చేయాలి. 10కోట్ల మంది రవాణా రంగ కార్మికులకు కేరళ తరహాలో సంక్షేమ బోర్డు ఏర్పాటుతో పాటు ప్రభుత్వమే యాప్‌ను నడపాలి. లైసెన్స్, రెన్యువల్, రిజిస్ట్రేషన్, వాహన ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఆర్టీవో కార్యాలయం ద్వారా జరగాలి. అచ్యుతాపురంలో ఏర్పాటు చేసిన ప్రైవేట్ ఫిట్‌నెస్ సెంటర్లను రద్దు చేయాలి. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి. వాహన కొనుగోలుకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. వాహన మిత్ర రూ.15000 తక్షణమే చెల్లించాలని కోరుతూ జూలై 9న జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో రవాణా రంగ, ఓనర్లు, డ్రైవర్లు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆలిండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ కోరింది. ఈ మేరకు ఆదివారం జిల్లా పరిషత్ మినిస్టీరియల్ భవన్‌లోని యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎ.జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రవాణా రంగంపై పెద్ద ఎత్తున దాడి చేస్తోందన్నారు. ర్యాపిడో, ఊబర్, ఓలా వంటి సంస్థలను అనుమతించడంతో స్వయం ఉపాధిగా బతుకుతున్న ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌లకు బేరాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని, సొంత వాహనాలను అమ్ముకోవడం లేదా ప్రైవేట్ సంస్థల యాప్‌లకు బందీలుగా మారిపోతున్నారని వాటిని రద్దుచేసి కేరళ తరహాలో ప్రభుత్వం యాప్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. రవాణా రంగాన్ని ఆదాయ వనరుగా కాకుండా సర్వీస్ రంగంగా గుర్తించి ప్రోత్సహించాలని, వారిౖపై వివిధ రూపాల్లో వేస్తున్న భారాలను తక్షణమే రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర రహదారుల్లో కూడా టోల్ గేట్లు ఏర్పాటు చేసి వాహనుదారులపై భారాలు వేస్తున్నారని మండిపడ్డారు.
రవాణా రంగ డ్రైవర్లకు ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్ పిలుపు