
జిల్లాలో 42,817 బంగారు కుటుంబాలు
పార్వతీపురం టౌన్: జిల్లాలో 42,817 బంగారు కుటుంబాలు ఉన్నాయని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. ఈ కుటుంబాలను మార్గదర్శితో సమన్వయం చేయాలని ఆయనన్నారు. ప్రభుత్వం బంగారు కుటుంబాలను ఆన్‌లైన్ ద్వారా ఎంపిక చేసిందన్నారు. శనివారం సంబంధిత అధికారులతో కలెక్టర్ వర్క్‌షాప్ నిర్వహించి, కుటుంబాన్ని పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి నిబద్ధతతో పని చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నియోజకవర్గ స్థాయి వర్క్ షాప్‌లు జిల్లాలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు కుటుంబం, మార్గదర్శి మధ్య అంతరాన్ని పూడ్చడానికి అధికారిక బృందం స్ఫూర్తితో పని చేయాలన్నారు. యోగాంధ్రలో జిల్లా బృందం చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. జిల్లాను ఒక నమూనాగా ఉంచడానికి మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ కార్యక్రమంలో అదే స్ఫూర్తితో పని చేయాలని ఆయన కోరారు. మనస్సుతో పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇళ్లను మార్గదర్శితో మ్యాప్ చేయాలని ఆయనన్నారు. పనిని పర్యవేక్షించడానికి సిబ్బందిలో ఒకరిని కన్వీనర్‌గా నియమించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ నోడల్ అధికారిగా ఉంటారని ఆయన అన్నారు. జాయింట్ కలెక్టర్ ఎస్‌ఎస్ శోభిక మాట్లాడుతూ పీ4 వెబ్‌సైట్‌లో మార్గదర్శిగా నమోదు చేసుకోవడానికి ముందుకు రావాలని కోరారు. సమావేశంలో పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, పాలకొండ సబ్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎస్.భాస్కరరరావు, ఆర్‌బీఎస్‌కె ప్రాజెక్టు అధికారి డా. టి.జగన్‌మోహన్‌రావు, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.సుధారాణి, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి కొండలరావు, ఈపీడీసీఎల్ కార్య నిర్వాహక ఇంజినీర్ కె.వేణుగోపాల్‌నాయుడు, గ్రామీణ నీటి సరఫరా విభాగం డిప్యూటీ డీఈ రెడ్డి పాల్గొన్నారు.