
విత్తుకు అదును కరువు!
వీరఘట్టం: ఈ ఏడాది ఖరీఫ్‌కు వాతావరణం సహకరించకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఏటా జూలై మొదటి వారానికి వరి నారుమడులు సిద్ధం చేసేవారు. జూలై నెలాఖరుకు 80 శాతం వరినాట్లు పూర్తయ్యేవి. మిగిలిన 20 శాతం ఆగస్టు 15 వరకు జరిగేవి. ప్రస్తుత వాతావరణంలో వింత పరిస్థితులు నెలకున్నాయి. గత 15 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో నారుమడుల్లో విత్తనాలు జల్లేందుకు అదును కుదరడంలేదు. వెదజల్లుదామన్నా తేమ ఎక్కువ కావడంతో దుక్కిచేయలేని పరిస్థితి. ఈ విపత్కర పరిస్థితుల నుంచి ఎప్పుడు గట్టెక్కుతామో తెలియక రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు.
అనుకూలించని వాతావరణం
ఏటా ఆరుద్ర కార్తెలో రైతులు వరి విత్తనాలను వేసి నారుమడులు సిద్ధంచేస్తారు. ఈ ఏడాది జూన్ 22న ఆరుద్ర కార్తె ప్రారంభమైంది. ఈ కార్తెలో విపరీతమైన ఉక్కపోత ఉంటుంది. ఇలా 14 రోజుల పాటు ఉండే ఆరుద్రకార్తెలో నారుమడులు సిద్ధం చేస్తారు. అయితే, గడిచిన 15 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో ఆరుద్రకార్తె సీజన్ ప్రభావం కనిపించ లేదు. వాతావరణం వరి నారుమడులకు అనుకూలించకపోవడంతో ఖరీఫ్‌కు ఎలా సన్నద్ధంకావాలో తెలియక రైతన్నలు దిగులు చెందుతున్నారు. ఈ ఏడాది జిల్లాలో ఖరీఫ్‌లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 1.75 లక్షల ఎకరాలు కాగా, ఆ మేరకు సాగు అవుతుందా లేదా అన్న బెంగ రైతులను వెంటాడుతోంది.
ఒక్క మొలక కూడా రాలేదు
నేను ఐదెకరాల్లో వరి సాగుకు సిద్ధమయ్యాను. రెండు బస్తాల విత్తనాలను నారుమడిలో జల్లాను. 15 రోజులుగా రోజూ వర్షం కురుస్తుండడంతో విత్తనాలు కుళ్లిపోయాయి. ఒక్క మొలక కూడా రాలేదు. ఏం చేయాలో అర్థంకావడంలేదు.
– డి.మహేష్.రైతు,వీరఘట్టం
20 కుంచాల
విత్తనాలు వేశాను
ఏటా వరినాట్లు వేస్తున్నాను. ఈ ఏడాది కూడా వరి నారుమడి సిద్ధం చేసి 20 కుంచాల విత్తనాలను జల్లాను. ఇంకా మొలకలు రాలేదు. వాతావరణం చూస్తే రోజూ వర్షం పడుతూనే ఉంది. ఏం జరుగుతుందోనని ఆందోళనగా ఉంది.
– కె.రమణ, రైతు, వీరఘట్టం
15 రోజులుగా కురుస్తున్న చిరుజల్లులు
అదునుకాని పొలాలు
సమయం మించిపోతుండడంతో ఆందోళనలో అన్నదాత
ఆందోళన వద్దు
ప్రస్తుతం వాతావరణం గత 15 రోజులుగా బాగాలేనందున రైతులు నారుమడులు, వెదజల్లేందుకు ముందుకు రాలేదు. అక్కడక్కడా కొద్దిగా వేసిన నారుమడుల్లో మొలకలు రాలేదనే విషయం తెలిసింది. వర్షం నిరంతరాయంగా కురుస్తుంటే విత్తనం కుళ్లిపోయి మొలకలు రావు. అదును ఇంకా ఉంది. ఆగస్టు 15 వరకు వరినాట్లు వేయవచ్చు.
– రాబర్ట్‌పాల్, జిల్లా వ్యవసాయశాఖాధికారి, పార్వతీపురం మన్యం జిల్లా

విత్తుకు అదును కరువు!

విత్తుకు అదును కరువు!