
ఇసుక ర్యాంప్ పరిశీలన
భామిని: మండలంలోని నేరడి బీ – బిల్లుమడ గ్రామాల మధ్య వంశధార నదీ తీరంలో నిర్వహించాల్సిన ఇసుక ర్యాంప్ స్థలాన్ని జిల్లా భూగర్భ గనులశాఖ ఏడీ శ్రీనివాస్ మంగళవారం పరిశీలించారు. ఇప్పటికే నేరడి – బిల్లుమడ గ్రామాల మధ్య ఇసుక ర్యాంపు నిర్వహణకు ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసిన నేపథ్యంలో భూగర్భ గనుల అధికారుల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
చిన్నబగ్గ కొండ శిఖరాన గజరాజులు
సీతంపేట: మండలంలోని చిన్నబగ్గ కొండ శిఖర గ్రామాల్లో మంగళవారం ఏనుగుల గుంపు సంచరించింది. కొండదిగువన ఉన్న ఏనుగుల గుంపు కొండపైకి వెళ్లడంతో చిన్నబగ్గ పరిసర ప్రాంతాల గిరిజనులు ఊపిరి పీల్చుకున్నారు. ఏ క్షణాన మళ్లీ కొండ దిగి వచ్చేస్తాయోనని భయాందోళన చెందుతున్నారు. అటవీశాఖ ట్రాకర్లు ఏనుగుల గమనాన్ని పరిశీలించి గిరిజనులను అప్రమత్తం చేస్తున్నారు.
గిరిజన యూనివర్సిటీలో స్పాట్ అడ్మిషన్లు
● 8, 9 తేదీల్లో ఓపెన్ కౌన్సెలింగ్
విజయనగరం అర్బన్: కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో 2025–26 విద్యాసంవత్సరానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లను ఈ నెల 8, 9వ తేదీల్లో ఓపెన్ కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తామని విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ తంత్రవాహి శ్రీనివాసన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్‌లో 8వ తేదీన ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ బయోటెక్నాలిజీ, ఎంబీఏ, 9వ తేదీన పీజీ ఇంగ్లిష్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, సోషియాలజీ, ట్రైబల్ స్టడీస్, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆయా రోజుల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే కౌన్సెలింగ్‌కు సంబంధిత విద్యార్హత ధ్రువపత్రాలతో నేరుగా యూనివర్సిటీకి హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్ ‘సీటీయూఏపీ.ఏసీ.ఐఎన్’ను సందర్శించాలన్నారు.
మద్యంమత్తులో దొరికిన దొంగ
బొబ్బిలి: ఓ ఇంటిలో ఐదు రోజులుగా దొంగతనం చేస్తూ అదే ఇంటింలో మద్యం మత్తులో నిద్రపోయిన దొంగను బొబ్బిలి పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బొబ్బిలి పట్టణం గొల్లపల్లి అంబేడ్కర్ కాలనీలో నివసిస్తున్న శీర శ్రీనివాసరావు వ్యవసాయ పనుల నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి ఐదు రోజుల కిందట స్వగ్రామమైన అలజంగి వెళ్లారు. ఈ విషయాన్ని కనిపెట్టిన పిరిడి గ్రామానికి చెందిన కె.కృష్ణ ఆ ఇంటిలోకి ప్రవేశించాడు. ఇంటిలో ఉన్న వెండి, ఇత్తడి సామాన్లు దొంగిలించి విక్రయించడం, కొనకపోతే తాకట్టు పెట్టడం చేసి మద్యం కొనుగోలు చేసి ఆ ఇంట్లోకే వెళ్లి తాగుతూ, తింటూ గడిపాడు. ఐదు రోజులుగా ఇదే తంతు జరుగుతోంది. ఇంటి యజమాని మరో రెండు రోజులు రాడనుకున్నాడో ఏమో మంగళవారం కూడా మరికొన్ని సామాన్లు విక్రయించి పూటుగా మద్యం తాగి ఎప్పటివలే చల్లగా ఉందని ఇంటి గచ్చుపై నిద్రపోయాడు. స్థానికులు దొంగను గుర్తించి అలజంగిలో ఉన్న శ్రీనివాసరావుకు సమాచారమందించారు. ఈ లోగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారమందుకున్న ఎస్‌ఐ ఆర్.రమేష్ కుమార్ తన సిబ్బందితో వచ్చ దొంగను పట్టుకున్నారు. అప్పటికే నిద్రమత్తులో ఉండడంతో పిరిడిలోని కృష్ణ ఇంటికి ఫోన్ చేశారు. అతడిని ఇంటికి పంపొద్దంటూ కుటుంబ సభ్యులు తిరిగి పోలీసులను వేడుకోవడం గమనార్హం. కేసు నమోదు చేయడమా, లేదంటే దొంగకు కౌన్సెలింగ్ ఇవ్వడమా అన్నది బుధవారం తేల్చుతామని ఎస్‌ఐ తెలిపారు.

ఇసుక ర్యాంప్ పరిశీలన

ఇసుక ర్యాంప్ పరిశీలన

ఇసుక ర్యాంప్ పరిశీలన