రెండు బైక్‌లు ఢీకొని వ్యక్తి మృతి
పార్వతీపురం రూరల్: మండలంలోని చిన్నమరికి గదబవలస గ్రామాల మధ్యలో ఉన్న మలుపు వద్ద సోమవారం సాయంత్రం ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో జియ్యమ్మవలస మండలం బసంగి గదబవలసకు చెందిన చాట్ల సింహాచలం (33) మృతి చెందినట్లు పార్వతీపురం రూరల్ ఎస్సై బి.సంతోషి కుమారి పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
పెళ్లి పనుల నిమిత్తం వెళ్లి..
మృతుడిని జియ్యమ్మవలస మండలం బసంగి గదబవలసకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. గరుగుబిల్లి మండలం తోటపల్లి జలాశయం సమీపంలో ఉన్న ఐటీడీఏ పార్కులో నిర్వహణ పనుల సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నాడు. మృతుడి అత్తవారు పార్వతీపురం మండలంలోని కొత్తూరు కావడంతో బుధవారం జరగనున్న తన బావమరిది పెళ్లి పనుల నిమిత్తం వెళ్లి తిరుగు ప్రయాణంలో మామతో కలిసి వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతుడికి మూడేళ్ల అబ్బాయి ఉండగా భార్య గర్భిణి కావడంతో డెలివరీ నిమిత్తం కన్నవారింట్లో ఉంది. కుటుంబ పోషణకు పెద్ద దిక్కుగా ఉన్న యజమాని మరణంతో అత్తవారింట, కన్నవారింట విషాదఛాయలు అలుముకున్నాయి.
రెండు బైక్‌లు ఢీకొని వ్యక్తి మృతి


