ఈదురు గాలులకు చెట్టు విరిగి పడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

ఈదురు గాలులకు చెట్టు విరిగి పడి వ్యక్తి మృతి

May 27 2026 5:56 AM | Updated on May 27 2026 5:56 AM

దమ్మాలపాడు(ముప్పాళ్ళ): గేదెలు తోలుకొని పొలానికి వెళ్లిన దివ్యాంగుడు వర్షానికి తడవకుండా ఉండేందుకు చెట్టుకిందకు వెళ్లగా ఈదురుగాలులకు చెట్టు విరిగి పడి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండలంలోని దమ్మాలపాడు గ్రామంలో సోమవారం జరిగింది. సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన జక్కిరెడ్డి కోటిరెడ్డి(53) పుట్టుకతోనే బదిరుడు. సోమవారం గేదెలు తోలుకొని గ్రామంలోని పడమర వైపు పొలాలకు వెళ్లాడు. సాయంత్రానికి అకస్మాత్తుగా మబ్బులతో పాటుగా చిరుజల్లులు కురుస్తుండటంతో తడవకుండా ఉండేందుకు గాను చెట్టుకిందకు వెళ్లాడు. పెద్ద పెద్ద ఈదురుగాలులకు చెట్టు విరిగి కోటిరెడ్డిపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చీకటి పడిన తర్వాత గేదెలు ఇంటికి వచ్చినప్పటికీ కోటిరెడ్డి రాకపోవటంతో కుటుంబసభ్యులు వెతుకులాట చేపట్టగా చెట్టుకింద మృతి చెంది ఉండటాన్ని గమనించి ఇంటికి తీసుకొచ్చారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు.

బేస్‌బాల్‌ టోర్నీలో రాష్ట్ర జట్లు ముందంజ

రొంపిచర్ల: భువనేశ్వర్‌లో నిర్వహిస్తున్న సబ్‌ జూనియర్‌ నేషనల్‌ బేస్‌బాల్‌ టోర్నమెంట్‌లో రాష్ట్ర బాలికల, బాలుర జట్లు క్వార్టర్‌ ఫైనల్‌కి చేరాయని రొంపిచర్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు సైదయ్య మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాలుర జట్టు కేరళం మీద 6–3 తేడాతో, మధ్యప్రదేశ్‌ మీద 7–3 తేడాతో విజయం సాగించగా, బాలికల జట్టు రాజస్థాన్‌ జట్టుపై 10–0, పశ్చిమ బెంగాల్‌ జట్టుపై 15–0 తేడాతో విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్లో ప్రవేశించాయన్నారు. బాలుర జట్టులో రొంపిచర్ల పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఉండగా, బాలికల జట్టులో 13 మంది ఉన్నారు.

భార్య మృతికి కారణమైన భర్త అరెస్ట్‌

దాచేపల్లి: భార్య మృతికి కారణమైన భర్తని అరెస్ట్‌ చేసినట్లు సీఐ ఎం.రాజేష్‌ మంగళవారం తెలిపారు. మండలంలోని పెదగార్లపాడుకి చెందిన షేక్‌ జాన్‌బీ కుమార్తె ఆశాని మాచర్ల మండలం కొత్తూరుకి చెందిన షేక్‌ సుభానీకి ఇచ్చి గత 15 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఒక కుమార్తె సంతానం. ఉపాధి కోసం వీరిద్దరు మండలంలోని గామాలపాడు గ్రామంలో నివాసం ఉంటున్నారు. సుభాని చెడు వ్యసనాలకు లోనై తరచూ భార్య ఆశాని హింసపెడుతున్నాడు. సుభాని మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ, ఆశాని హింసలకు గురి చేయటంతో పాటుగా ఆత్మహాత్య చేసుకునేలా ప్రేరించాడు. దీంతో గత మార్చి నెల 6వ తేదీన ఇంట్లోనే చీరతో ఉరివేసుకుని ఆశా ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో తన కుమార్తె ఆత్మహత్యకు కారణమైన సుభానిపై జాన్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుభానిని అరెస్ట్‌ చేసి కోర్టులో హజరుపరిచామని సీఐ రాజేష్‌ చెప్పారు.

హత్యాయత్నం కేసులో ఇద్దరికి రిమాండ్‌

ముప్పాళ్ళ: ద్విచక్రవాహనం పై వస్తున్న వ్యక్తిని ట్రాక్టర్‌ తో ఢీకొట్టి హత్యచేయబోయిన సంఘటనపై నమోదైన కేసులో ఇద్దరిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్‌ఐ పి.అనిల్‌కుమార్‌ మంగళవారం తెలిపారు. మండలంలోని చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన కత్తి శివారెడ్డి ఈ నెల 23వ తేదీన సత్తెనపల్లి నుంచి ద్విచక్రవాహనం పై వస్తుండగా, అదే గ్రామానికి చెందిన మధిర వీరారెడ్డి అతనికి అల్లుడు వరసైన అన్నపురెడ్డి కోటిరెడ్డిలు పాతకక్షల నేపధ్యంలో బొల్లవరం అడ్డరోడ్డు వద్ద మట్టిలోడు ట్రాక్టర్‌తో ద్విచక్రవాహనం వెనుకగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో శివారెడ్డికి గాయాలు కావటంతో చికిత్స నిమిత్తం నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. శివారెడ్డి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసి అందుకు బాధ్యులైన వారిని అరెస్ట్‌ చేసి సత్తెనపల్లి కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌ విఽధించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement