భానుడు భగభగ | - | Sakshi
Sakshi News home page

భానుడు భగభగ

May 21 2026 1:59 AM | Updated on May 21 2026 1:59 AM

భానుడు భగభగ ● జిల్లాలో నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ● ప్రమాదకర స్థాయిలో వేడిగాలులు ● జ్వరాలు వచ్చినా అప్రమత్తంగా ఉండాల్సిందే ● తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ సూచన సాగర్‌ నీటిమట్టం

న్యూస్‌రీల్‌

మంట చింతల

గురువారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2026

విజయపురి సౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం బుధవారం 524.00 అడుగు లకు చేరింది. ఇది 156.6700 టీఎంసీలకు సమానం.

సత్తెనపల్లి: వేసవిలో మండుతున్న ఎండలు ప్రజలను ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మునుపెన్నడు లేని విధంగా మే నెలలో పగటి ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎండలో బయటకు వెళ్లాలంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వ్యాధులు కూడా అదే స్థాయిలో వ్యాపిస్తు న్నాయి. జిల్లాలోని ఏరియా వైద్యశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేట్‌ ఆసుపత్రులకు రోగుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. ముందస్తు జాగ్రత్తలు పాటించకపోతే ముప్పు తప్పదని అధికారులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. వడదెబ్బ, టైఫాయిడ్‌, అతిసార, పచ్చకామెర్లు వంటి వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది.

వడదెబ్బకు ఆస్కారం ఎక్కువ

ఎండ తీవ్రతతో శరీర ఉష్ణోగ్రత కూడా పెరిగి మెదడు మీద ప్రభావం చూపుతోంది. దీనివల్ల మెదడులోని ఉష్ణోగ్రత నియంత్రించే కేంద్రం (హైపో థాలామస్‌) దెబ్బతిని వడదెబ్బకు గురవుతారు. దీనినే హీట్‌స్ట్రోక్‌ లేదా సన్‌స్ట్రోక్‌ అంటారు. ఇది ప్రాణాంతకంగా మారుతోంది. శరీరంలోని ఎలక్ట్రోలైట్స్‌, మినరల్స్‌, నీటి శాతం తగ్గి సత్తువలేని స్థితికి చేరడాన్ని వడదెబ్బ అంటారు. శరీర ఉష్ణోగ్రత పెరగడం, చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం, కండరాలు గట్టిపడటం, చర్మం ఎర్రగా మారడం, వాంతులు కావడం, మూర్ఛ రావడం, తలనొప్పి తదితర లక్షణాలు ఉంటే వడదెబ్బగా అనుమానించి వెంటనే వైద్యులను సంప్రదించాలి.

తీసుకోవలసిన జాగ్రత్తలు..

వడదెబ్బ బారిన పడకుండా రోజుకు 10 నుంచి 15 గ్లాసుల నీరు తాగాలి. పండ్లు, నిమ్మరసం, పలచటి మజ్జిగ, కొబ్బరి నీరు, చెరుకు రసం ఎక్కువగా తీసుకోవాలి. తెల్లటి దుస్తులు ధరించడం శ్రేయస్కరం. మసాలాలు, కారం, నూనె, ఫాస్ట్‌ ఫుడ్‌, మత్తు పానీయాలకు దూరంగా ఉండాలి. వడదెబ్బ తగిలితే ఆ వ్యక్తిని ఏదైనా చల్లని ప్రాంతం, నీడలో పడుకోబెట్టాలి. చల్లని నీటితో చర్మాన్ని తుడిచి, బట్టలను తడపాలి. ఆ వ్యక్తికి గాలి తగిలేలా చూసి, చల్లని తాగునీటి అందించాలి. ఐస్‌ పెట్టడం కానీ, కోల్డ్‌ కంప్రెషన్‌ ఇవ్వాలి.

అతిసార బాధితులకు..

అతిసార సోకిన వారికి నీళ్ల విరోచనాలు అవుతాయి. పిల్లలు, వృద్ధులకు చాలా ఇబ్బంది. సకాలంలో స్పందించకపోతే ప్రాణాలకే ప్రమాదం. కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం, శరీరంలో నీటి శాతాన్ని కోల్పోవడం జరుగుతుంది. నిల్వ ఉన్న ఆహారం, నీరు తీసుకోకూడదు. ఎలక్ట్రాల్‌ పౌడర్‌తో నీటి శాతం, లవణాలు పెంచుకోవచ్చు.

పచ్చకామెర్లు వస్తే...

తాగునీరు కలుషితమైతే పచ్చకామెర్లు వస్తాయి. దీన్ని హెపటైటిస్‌–ఏ అని కూడా అంటారు. చర్మం పచ్చబడటం, మూత్రం పచ్చగా రావడం, చర్మంపై దురద, ఆకలి మందగించడం, జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. శుభ్రమైన నీటినే తాగాలి. నూనె వినియోగం బాగా తగ్గించాలి.

టైఫాయిడ్‌ వస్తే ఇలా..

ఇది అపరిశుభ్రమైన తాగునీరు, కలుషిత ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల టైఫాయిడ్‌ జ్వరం వస్తుంది. అతి జ్వరం, అలసట, నిస్సత్తువ, కడుపునొప్పి, తలనొప్పి, ఆకలి లేకపోవడం వంటివి టైఫాయిడ్‌ లక్షణాలు. అలాగే చర్మ సమస్యలు కూడా తలెత్తుతాయి. శుభ్రమైన తాగునీటిని, ఆహారాన్ని తీసుకోవాలి. బయట దొరికే చిరుతిళ్లు పూర్తిగా మానేయాలి. వైద్యుడిని సంప్రదించి మందులను వాడాలి.

జిల్లాలో ఇటీవల కాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటలకే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉపాధి హామీ కూలీలపై భానుడు ప్రతాపాన్ని చూపుతున్నాడు. చిరు వ్యాపారులు ఎండ తీవ్రత తట్టుకోలేక దుకాణాలను మూసి వేస్తున్నారు. 40–42 డిగ్రీల సెల్సియస్‌ నుంచి ఉష్ణోగ్రత ప్రతిరోజు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రానున్న నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో అధిక ఎండల నుంచి రక్షణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

రెంటచింతల: మండల కేంద్రమైన రెంటచింతలలో భానుడు నిప్పుల వర్షం కురిపించాడు. ఎండల దెబ్బకు గ్రామస్తులు అల్లాడిపోతున్నారు. బుధవారం గ్రామంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 46.3గా నమోదైనట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. రెంటచింతల గ్రామంలో ఈ ఏడాది నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. కొన్ని రోజులుగా 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదు కావడంతోపాటు ఉదయం 10 గంటల నుంచే వడగాడ్పులు వీస్తున్నాయి. దీంతోపాటు భూమి నుంచి సుర్రుమంటూ వచ్చే వెచ్చని సెగలతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ప్రధాన రహదారితోపాటు గ్రామంలోని అంతర్గత రహదారులు నిర్మానుష్యంగా మారాయి. భానుడు నిప్పులు కురిపిస్తుండటంతో అత్యవసరమైతే తప్ప గ్రామస్తులు ఇట్లోంచి బయటకు రావడం లేదు. తీవ్రమైన ఉక్కపోతకు తట్టుకోలేక పలు ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండుతున్న ఎండలకు వృద్ధులు, బాలింతలు, చిన్నారులు, గర్భిణులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement