ఆగస్టు 1, 2 తేదీలలో టైప్ రైటింగ్ పరీక్షలు రేపల్లె: ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (మంగళగిరి) ఆధ్వర్యంలో టైప్ రైటింగ్ పరీక్షలు ఆగస్టు 1, 2 తేదీలలో నిర్వహించనున్నట్లు ఏపీ టైప్‌రైటింగ్ అండ్ షార్ట్ హ్యాండ్ ఇనిస్టిట్యూట్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు సీవీ మోహనరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు ఇంగ్లిష్, తెలుగు, హిందీ భాషలలో లోయర్, హయ్యర్ గ్రేడ్, హైస్పీడ్ విభాగాలలతోపాటు అదనంగా ఇంగ్లిష్ జూనియర్ గ్రేడ్ విభాగంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రేపల్లె, తెనాలి, గుంటూరు, నరసరావుపేటలలో పరీక్షలు ఉంటాయన్నారు. షార్ట్ హ్యాండ్ పరీక్షలు జూలై 25, 26 తేదీలలో రాష్ట్రంలోని విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూల్ కేంద్రాలలో మాత్రమే నిర్వహించనున్నట్లు చెప్పారు. చేతి చమురు వదులుతోంది
● జిల్లా వాసులపై రోజుకు రూ. 27.39 లక్షల ‘పెట్రో’ భారం సత్తెనపల్లి: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఇక నుంచి ప్రతి రోజు ధరలు పెరిగే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. డీజిల్, పెట్రోల్ ధరలు పెరుగుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగదారులను ఆదుకోవాలి. కొంతవరకు రాయితీని అందజేయాలి. అయితే మన రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదు. రెండు రోజులు క్రితం వరకు జిల్లాలో పెట్రోల్ ధర లీటరు రూ. 109.65 ఉండేది. రూ.3.35 పెంచడంతో రూ.113 కు చేరింది. ప్రస్తుతం రూ.96 పైసలు పెంచారు. దీంతో లీటర్ ధర రూ. 113.96 కు చేరింది. మూడు రోజుల వ్యవధిలో రెండు విడతులుగా లీటర్ పెట్రోల్‌కు ఏకంగా రూ.4.31 అదనపు భారం పడంది. డీజిల్ లీటర్ ధర రూ. 97.53 ఉండేది. రూ. 3.16 పెంచడంతో రూ. 100.69 చేరింది. ప్రస్తుతం రూ. 95 పైసలు పెంచింది. దీంతో లీటర్ ధర రూ. 101.62కు చేరింది. మూడు రోజుల వ్యవధిలో రెండు విడతలుగా లీటర్ డీజిల్‌కు ఏకంగా రూ.4.11 అదనపు భారం వినియోగదారులపై పడుతోంది. జిల్లాలో అన్ని రకాల కంపెనీలకు సంబంధించిన 194 డీజిల్, పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటి ద్వారా సగటున ప్రతిరోజు పెట్రోల్, డీజిల్ కలిపి రూ. 27,39,050 వరకు జిల్లావాసులపై అదనపు భారం తప్పడం లేదు.
వినుకొండ: మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన సదస్సు పల్నాడు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ కృష్ణారావు హాజరయ్యారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గృహ హింస బాధితులు 181, అత్యవసర సేవల కోసం 112, మహిళలపై వేధింపులు, అక్రమ రవాణాకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 1091, చైల్డ్ సేఫ్టీ కోసం 1098 నంబర్ల వినియోగంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎస్పీ హనుమంతరావు, రూరల్ సీఐ బ్రహ్మయ్య, సీఐ సుభాషిణి, పట్టణ కమిషనర్ శివరాం ప్రసాద్ పాల్గొన్నారు.
ప్రతిభ పురస్కారాలకు దరఖాస్తులు
గుంటూరు ఎడ్యుకేషన్: ఏకలవ్య ట్రైబల్ డెవలప్‌మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో పది, ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేయనున్నట్లు సొసైటీ రాష్ట్ర కన్వీనర్ డి.శ్రీనివాసరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన ఎరుకల సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పదో తరగతిలో 540, జూనియర్ ఇంటర్‌లో 420, సీనియర్ ఇంటర్‌లో 900 మార్కులకు పైబడి మార్కులు సాధించిన వారు అర్హులని తెలిపారు. జూన్ 15వ తేదీలోగా దరఖాస్తులను ‘133–8–1878, హిమనీనగర్ 3వ లైన్, నగరాలు, అమరావతిరోడ్డు, గుంటూరు–522035’ చిరునామాకు పంపాలన్నారు. ఇతర వివరాలకు 99594 14333, 79894 78961, 63043 57686 ఫోను నంబర్లలో సంప్రదించాలని సూచించారు.