ఎలక్ట్రికల్‌ దుకాణంలో చోరీ | - | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రికల్‌ దుకాణంలో చోరీ

May 21 2026 1:59 AM | Updated on May 21 2026 1:59 AM

ఎలక్ట్రికల్‌ దుకాణంలో చోరీ బావిలో పడి వ్యక్తి మృతి వ్యక్తి మృతికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్‌కు జైలు ప్రకృతి సమతుల్యత పరిరక్షణలో తేనెటీగల పాత్ర కీలకం క్వింటా పసుపునకు రూ.7 వేలు చెల్లించాలి బక్రీద్‌ రోజున అనధికార జంతు వధ నిషేధం

రూ.1.20 లక్షల నగదు అపహరణ

నరసరావుపేట టౌన్‌: ఎలక్ట్రికల్‌ దుకాణం తాళాలు పగులగొట్టి కౌంటర్‌లో రూ.1.20 లక్షలు నగదు అపహరించుకెళ్లిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్‌ సీఐ షేక్‌ ఫిరోజ్‌ బుధవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక వరవకట్ట నుంచి కూరగాయల మార్కెట్‌కు వెళ్లే దారిలో ఆజాద్‌ ఎలక్ట్రికల్‌ షాప్‌ తాళాలను గుర్తుతెలియని దుండగులు పగలగొట్టి దుకాణంలోని నగదు అపహరించుకు వెళ్లారు. దుకాణ యజమాని ఆజాద్‌ రోజు మాదిరిగానే షాప్‌నకు తాళాలు వేసి ఇంటికి వెళ్లాడు. ఉదయం వచ్చి చూసే సరికి షట్టర్‌ తాళాలు పగలగొట్టి ఉన్నాయి. కౌంటర్‌లో నగదు కనిపించక పోవటంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ వంశీకృష్ణా చోరీ జరిగిన తీరును పరిశీలించారు. ఈ మేరకు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

చిలకలూరిపేటటౌన్‌: ప్రమాదవశాత్తు వ్యక్తి బావిలో పడి మృతి చెందిన ఘటన పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సూదావారిపాలెంకు చెందిన ప్లంబ్లింగ్‌ వర్కర్‌ ఇమ్మడి శ్రీనివాసరావు(50) రోజు సాయంత్రం వేళ ఇంట్లో భోజనం చేసిన తర్వాత సమీపంలో ఉన్న బావిపై కూర్చొని కాలక్షేపం చేయడం పరిపాటి. అయితే మంగళవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి తిరిగి రాకపోవడంలో కుటుంబ సభ్యులు వెతుకులాట ప్రారంభించారు. అనుమానంతో బుధవారం ఉదయం బావి వద్దకు వెళ్లి చూడగా అందులో ఇరుక్కొని విగతజీవిగా కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని బయటకు తీసి చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టంకు తరలించారు. భార్య మాధవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

పిడుగురాళ్ల: ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు కోర్టు ఏడాది జైలు శిక్షతోపాటు, రూ. 1100 జరిమానా విధించినట్లు పట్టణ సీఐ ఎస్‌.వెంకట్రావు బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు...2018లో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి పిడుగురాళ్ల బస్టాండ్‌ ఎదురు నిర్లక్ష్యంగా మలుపుతిప్పుతున్న క్రమంలో యూసప్‌ అనే వ్యక్తి ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో అప్పటి ఎస్‌ఐ రఫీ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి కేసు నమోదు చేశారు. దీనిపై పిడుగురాళ్ల పట్టణ జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి టి.ప్రవళిక బుధవారం తీర్పు వెలువరించారు. ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డికి ఏడాది జైలు శిక్షతోపాటు రూ. 1100 విధించినట్లు సీఐ తెలిపారు.

వ్యవసాయ కళాశాలలో ప్రపంచ తేనెటీగల దినోత్సవం

బాపట్ల: తేనెటీగలు ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని, పంటల పరాగసంపర్కంలో తేనెటీగల సేవలు వ్యవసాయ దిగుబడులను పెంచడంలో ఎంతో ఉపయోగపడతాయని బాపట్ల వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ పి.ప్రసూన రాణి అన్నారు. ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని పురస్కరించుకొని బాపట్ల వ్యవసాయ కళాశాల కీటక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ తేనె ఉత్పత్తితో పాటు తేనెటీగల పెంపకం గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే ఉత్తమ వాణిజ్య రంగమని వివరించారు. కీటక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్‌ ఎస్‌.ఆర్‌.కోటేశ్వరరావు మాట్లాడుతూ తేనెటీగల పెంపకంలో ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంభించడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. తేనె ప్రాసెసింగ్‌, నిల్వ, మార్కెటింగ్‌ అంశాలలో శిక్షణ పొందితే స్వయం ఉపాధి అవకాశాలు మరింత విస్తరిస్తాయని చెప్పారు. రైతులు, యువత తేనెటీగల పెంపకాన్ని అనుబంధ వ్యవసాయ వృత్తిగా స్వీకరించాలని సూచించారు. తేనెటీగలపై పరిశోధన చేస్తున్న ఎం.సాయికుమార్‌ తన పరిశోధనలోని పలు ఆసక్తికరమైన అంశాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు పాల్గొన్నారు.

దుగ్గిరాల బాధిత పసుపు రైతుల వినతి

కొరిటెపాడు(గుంటూరు): దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్‌ స్టోరేజీ అగ్నిప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు క్వింటాకు రూ.7,000 చొప్పున పరిహారం చెల్లించాలని బాధిత రైతులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందించినట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఇన్సూరెన్‌న్స్‌ సొమ్ము కలిపి క్వింటాకు రూ.5,000 చొప్పున ఇస్తామని ఫైనల్‌ సెటిల్‌మెంట్‌గా భావించి తమతో సంతకాలు చేయించారని వెల్లడించారు. అయితే దానికి తాము అభ్యంతరం తెలిపామని, 2024 జూలైలో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వద్ద రూ.7,000 చొప్పున ఇస్తామని కోల్డ్‌స్టోరేజీ యాజమాన్యం ఒప్పందానికి వచ్చిందని గుర్తుచేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు సంబంధించి ఇచ్చిన మార్పు లేఖను అంగీకరించి, తాము తయారుచేసిన పత్రాన్ని యాజమాన్యం అంగీకరించే వరకు నగదు పంపిణీ నిలిపివేయాలని అధికారులను కోరడం జరిగిందని వెల్లడించారు. అయినప్పటికీ రూ.5,000 పరిమితం చేసి ఫైనల్‌ సెటిల్‌మెంట్‌గా రసీదులు ఇవ్వడం అన్యాయమని బాధిత రైతులు ఎల్‌.భాస్కరరెడ్డి, రాజేష్‌, కళ్లం సీతారామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

లక్ష్మీపురం: బక్రీద్‌ రోజున అనధికార జంతు వధ నిషేధమని జిల్లా కలెక్టర్‌ సీఎం సాయి కాంత్‌ వర్మ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బక్రీద్‌ పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. గోవులను వధించరాదని, అధికారికంగా ఽధ్రువీకరించిన గొర్రెలు, మేకలను మాత్రమే వధింపుటకు అనుమతించడం జరుగుతుందని తెలిపారు. అనధికార జంతు వధపై సమాచారం అందించాలని కోరారు. సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌– 8688831391, పశు సంవర్ధక శాఖ– 8333086999, గుంటూరు మునిసిపాల్‌ కార్పొరేషన్‌ – 9849908363, పొన్నూరు మునిసిపాలిటీ – 9849905834, తెనాలి మునిసిపాలిటీ – 9849905830, ఎంటీఎంసీ– 7093320018, తెనాలి సబ్‌కలెక్టర్‌– 9849904008, రెవెన్యూ డివిజినల్‌ అధికారి, గుంటూరు – 9849904006, జిల్లా పంచాయతీ అధికారి– 9492758041.

Advertisement
 
Advertisement
Advertisement