మాచర్ల రూరల్: కార్మికుల సంక్షేమ, కర్మాగారంలో భద్రత, పరిశుభ్రతతో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పాటిస్తున్న కేసీపీ సిమెంట్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ కర్మాగారం, శ్రమశక్తి అవార్డును అందజేసింది. బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కలక్షేత్రంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదుగా అవార్డును సీనియర్ మేనేజర్ కె.వెంకటరమణ అందుకున్నారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ దశాబ్దాలుగా కేసీపీ సిమెంట్స్ నాణ్యతలో రాజీ పడకుండా, కార్మికుల భద్రత, వారి కుటుంబ సంక్షేమలో యాజమాన్యం తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి బెస్ట్ సిమెంట్ ఫ్యాక్టరీ, శ్రమశక్తి అవార్డును అందించిందన్నారు. ఇదే స్ఫూర్తితో ఉత్పత్తిలో నాణ్యత, ఉద్యోగుల భద్రతలో మరింత ప్రమాణాలు పాటిస్తూ ముందుకు పోతామన్నారు. రాష్ట్రస్థాయిలో కేసీపీ సంస్థకు బెస్ట్ అవార్డు రావడంపై ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు ఆనంద వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు.
నరసరావుపేట: జిల్లాలో జల్ జీవన్ మిషన్ 2.0, స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) కార్యక్రమాలను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతి లాల్ దండే నిర్వహించిన వీడియా కాన్ఫరెన్స్‌కు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంతి లాల్ దండే మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ పనులను వేగవంతం చేసి, పూర్తి చేసిన పథకాలను గ్రామ పంచాయతీలకు అప్పగించే ప్రక్రియను త్వరితగతిన ముగించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ 2.0 కింద గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పీఎం పథకాలతో గ్రామాలకు ప్రాధాన్యతనిస్తూ తాగునీటి కనెక్షన్లను అందిస్తున్నామన్నారు. నీటి నాణ్యత పర్యవేక్షణ, గ్రామస్థాయి ఎఫ్‌టీకే పరీక్షలు, స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీటి సదుపాయాల నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని తెలిపారు. గ్రామీణ పారిశుద్ధ్య కార్యక్రమాల పురోగతిని ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షించి సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా చూస్తున్నామని పేర్కొన్నారు.
నరసరావుపేట: రీసర్వేలో అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై అచ్చంపేట మండలం కోనూరు గ్రామ సర్వేయర్ కిరణ్ కుమార్, వీఆర్‌ఓ వెంకయ్యలను జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ సంజనా సింహా బుధవారం సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో కోనూరు గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదరు అధికారులు ఇద్దరూ భూమి కొలతలు, రెవెన్యూ రికార్డుల మార్పులు, ఇతర ప్రభుత్వ సేవల కోసం పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్ చేస్తున్నారని, తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. బాధితుల ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ ఆధారంగా ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రీసర్వే విషయంలో అధికారుల నిర్లక్ష్యం, అక్రమాలపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
తెనాలిరూరల్: ప్రేమ పేరుతోబాలికను వేధించిన యువకుడికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు. బాపట్ల జిల్లా వేమూరు మండలానికి చెందిన 17 ఏళ్ల బాలిక ఇంటర్ చదువుతూ ప్రతి రోజు సాయంత్రం గ్రామంలో ఇళ్లకు వెళ్లి పాలు పోస్తుండేది. బాలికను వేమూరుకు చెందిన వర్రె గోపి ప్రేమించమంటూ వేధించేవాడు. 2020 మే 24వ తేదీన పాలు పోసేందుకు వెళుతున్న బాలిక సైకిల్‌ను గోపి అడ్డగించి తనను ప్రేమించాలని ఇబ్బంది పెట్టాడు. బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా, వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి వేమూరు ఎస్‌ఐ ఎల్.లోకేశ్వరరావు కేసు నమోదు చేశారు. కేసు బుధవారం విచారణకు రావడంతో పరిశీలించిన తెనాలి పోక్సో కోర్టు న్యాయమూర్తి ఐ. ఇందిరాప్రియదర్శిని, నిందితుడికి ఏడాది జైలు శిక్ష, రూ.ఐదు వేల జరిమానా, జరిమానా చెల్లించని పక్షంలో మరో నెల జైలు శిక్ష విధించారు. ఐపీసీ సెక్షన్ 341 కింద నెల రోజుల జైలు శిక్ష, జరిమానా చెల్లించని పక్షంలో 15 రోజుల జైలు శిక్ష విధించారు. సెక్షన్ 12 పోక్సో యాక్టు కింద ఏడాది జైలు శిక్ష, రూ.ఐదు వేల జరిమానా, జరిమానా చెల్లించని పక్షంలో మరో నెల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. శిక్షలన్నీ ఏక కాలంలో అనుభవించాలన్నారు. ప్రాసిక్యూషన్ తరఫున పోక్సో కోర్టు స్పెషల్ ప్రాసిక్యూటర్ వెలినేని రాఘవయ్య వాదించారు.


